
నాలుగేళ్లలో మూడింతలైన ‘బ్యాంక్ ఫ్రాడ్స్’ సంఖ్య
నాలుగింట మూడొంతులు తగ్గిన మోసాల విలువ
విలువలో రుణ సంబంధ మోసాలదే సింహభాగం
కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌లో 5 రెట్ల వృద్ధి
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్స్ కనపడుతోంది. దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకుల దూకుడు, చవక ఇంటర్నెట్ పుణ్యమా అని డిజిటల్ బ్యాంకింగ్, ఆన్స్ లైన్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇంకేముంది దోపిడీకి సైబర్ మోసగాళ్ళకు ఇవి కొత్త మార్గాలను తెరిచాయి. దీంతో భారత్‌లో బ్యాంకుల పేరుతో జరిగే సైబర్ మోసాలు ఏటా పెరుగుతున్నాయి. బ్యాంకులలో పాలన, ముప్పు నిర్వహణలో లోపాలు సైతం ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. 2020–21తో పోలిస్తే బ్యాంకు మోసాల కేసుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు అధికమయ్యాయి. తక్కువ విలువ కలిగిన మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక చెబుతోంది.
దేశంలో 2024–25లో బ్యాంకింగ్ రంగంలో 23,953 మోసాల కేసులు నమోదయ్యాయి. 2020–21లో ఈ సంఖ్య 7,359. అప్పట్లో ఆ మోసాల విలువ రూ.1,38,211 కోట్లు. సైబర్ మోసగాళ్లు దోపిడీకి కొత్త మార్గాలు ఎలా వెతుకుతున్నారో.. వీటిని అరికట్టడానికి బ్యాంకులు కూడా నిరంతరం శ్రమిస్తూ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఫలితంగా ఈ మోసాల విలువ నాలుగేళ్లలో 74 శాతం తగ్గి గత ఆర్థిక సంవత్సరంలో రూ.36,014 కోట్లకు వచ్చింది.
2024–25లో లోన్లకు సంబంధించిన మోసాలలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని ఆర్‌బీఐ తెలిపింది. భారత కార్పొరేట్ రంగంలో భారీ విలువ కలిగిన నిరర్థక రుణాల సంఖ్య గత 2024–25లో గణనీయంగా పెరగడంతో బ్యాంకులు కంపెనీలకు రుణాలు ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ క్రెడిట్ అంచనా ప్రక్రియలను కఠినతరం చేస్తున్నాయి. మరోవైపు బ్యాంకులు రిటైల్ రుణాలపై దృష్టి సారించి డిజిటల్ బ్యాంకింగ్‌ను పెంచాయి.
రుణ మోసాలే ఎక్కువ..
గత నాలుగేళ్లలో జరిగిన మోసాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల పేరుతో జరిగినవే అధికం కావడం గమనార్హం. రిటైల్ రుణాలలో ప్రైవేట్ బ్యాంకులు మరింత దూకుడుగా వ్యవహరించడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో రెండింతలకుపైగా కేసులు నమోదయ్యాయి. మోసాల విలువ పరంగా మాత్రం ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండున్నర రెట్లు అధికంగా మూటగట్టుకున్నాయి. విదేశీ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ ్స బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్‌లో మోసం విలువ తగ్గినప్పటికీ కేసుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల నమోదైంది.
ఇందులో రుణ సంబంధిత మోసాలే ఎక్కువ. మొత్తం విలువలో వీటి వాటా 92 శాతానికిపైనే. క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాల సంఖ్య నాలుగేళ్లలో అయిదు రెట్లు దూసుకెళ్లడం ఆందోళన కలిగించే అంశం. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మోసాలలో సగానికి పైగా కేసులు (13,516) ఇవే. ఈ కేసుల విలువ రూ.520 కోట్లు. డిపాజిట్ మోసాల విలువ రూ.527 కోట్లు ఉంది.
పాత కేసుల కారణంగా..: 2024–25 జాబితా ఇంతలా పెరగడానికి కారణం.. గత సంవత్సరాలకు సంబంధించిన కేసులు కూడా వచ్చి చేరడమే. అలా రూ.18,674 కోట్ల విలువైన 122 మోసం కేసులు ఇందులో వచ్చి పడ్డాయి. 2023 మార్చి 27 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా 2024–25 బుక్స్‌లో కొత్తగా వీటిని చేర్చారు. దుర్వినియోగం, నేరపూరిత నమ్మక ద్రోహం, నకిలీ సాధనాల ద్వారా మోసపూరితంగా నగదు తీసుకోవడం, ఖాతా పుస్తకాలను లేదా కల్పిత ఖాతాల ద్వారా తారుమారు చేయడం, ఆస్తిని మార్చడం వంటివి బ్యాంకు మోసాల జాబితాలో ఉన్నాయి.