అమెరికాకు భారత్‌ షాక్‌..!

29 tariffs on products - Sakshi

29 ఉత్పత్తులపై సుంకాల పెంపు 

జాబితాలో ఐరన్,  స్టీల్, పప్పుధాన్యాలు 

అమెరికా చర్యకు ప్రతిచర్య  ఆగస్ట్‌ 4 నుంచి అమల్లోకి 

న్యూఢిల్లీ: వాణిజ్యం విషయంలో అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి భారత్‌ తగు విధంగా బదులిచ్చింది. తమదేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు టారిఫ్‌లను విధించిన విషయం తెలిసిందే. ఇది 241 మిలియన్‌ డాలర్ల విలువ మేర (రూ.1,600 కోట్లు) మనదేశ ఎగుమతులపైనా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు ఇలా మొత్తం 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన సుంకాలు ఆగస్ట్‌ 4 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాల్లో భాగంగా దిగుమతులపై టారిఫ్‌ల నిర్ణయం తీసుకోవడంతో ఇతర దేశాలు ఆ విధంగా ప్రతిస్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య ఇది తీవ్రరూపం దాల్చింది. తాను కస్టమ్స్‌ డ్యూటీని పెంచాలనుకుంటున్న 30 ఉత్పత్తుల జాబితాను గత వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు భారత్‌ సమర్పించింది. వాటిపై 50 శాతం వరకు సుంకాలు పెంచాలనుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఈ జాబితాలో కొన్ని రకాల మోటారు సైకిళ్లు 800సీసీ, ఆపైన సామర్థ్యం ఉన్న వాటిని (ముఖ్యంగా హార్లే డేవిడ్సన్, ట్రింఫ్‌) కూడా పేర్కొనగా... తాజా నోటిఫికేషన్‌లో మాత్రం పెంపు ప్రస్తావన లేదు. తాజాగా సుంకాల పెంపు ప్రభావం, అమెరికా పెంపు వల్ల మన ఎగుమతులపై పడే స్థాయిలోనే ఉండటం గమనార్హం. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు వేస్తూ ట్రంప్‌ సర్కారు ఈ ఏడాది మార్చి 9న నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విషయమై మన దేశం ఇప్పటికే డబ్ల్యూటీవోలో సవాలు చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top