రియల్టీలోకి 10,100 కోట్లు 

10k crores in Telangana realty sector - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి చోదకశక్తిగా మారింది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 తొలి ఆర్ధ సంవత్సరం వరకూ  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 10,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2008–14 మధ్యకాలంలో ఇది రూ.1,800 కోట్లుగా ఉందని జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) తెలిపింది. ఇందులోనూ 70 శాతం పెట్టుబడులు కార్యాలయాల విభాగమే ఆకర్షించిందని పేర్కొంది. బుధవారమిక్కడ జేఎల్‌ఎల్‌ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌లతో పాటూ  జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రమేష్‌ నాయర్, హైదరాబాద్‌ ఎండీ సందీప్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌ నాయర్‌ మాట్లాడుతూ.. బలమైన ఆర్థిక వృద్ధి, మౌలిక రంగం, ప్రపంచ స్థాయి కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలు తదితరాల వల్ల ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల మీద సానుకూల ప్రభావంచూపిస్తుందని తెలిపారు. కో–వర్కింగ్‌ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల విస్తరణ హైదరాబాద్‌ అభివృద్ధికి ముఖ్య కారణమని పేర్కొన్నారు. 

కొత్త ప్రాజెక్ట్‌ల్లో తగ్గుముఖం
ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం నాటికి నగరంలో 13.2 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 50–60శాతం స్పేస్‌ అప్పటికే ఆక్యుపై అయిందని నివేదిక తెలిపింది. నివాస విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు తగ్గుముఖం పట్టాయి. పుప్పాలగూడ, గోపనపల్లి, మణికొండ, నార్సింగి, నల్లగండ్ల ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 40% ప్రాజెక్ట్‌లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నాయి. ఈ ఏడాది క్యూ1లో ధరల్లో 6% వృద్ధి నమోదైంది
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top