అప్పుడే నీటి కటకట..!

Water Problems In Bhadradri kothgudem - Sakshi

సాక్షి, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావపరిస్థితులతో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. అదేవిధంగా సాగునీరు అందక రైతులు పంటల సాగును తగ్గించారు. సాగుచేసిన పంటలకు కూడా  సరిపడా నీరందని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో కేవలం బోర్లు, విద్యుత్‌ మోటార్ల కిందనే రబీ పంటలు సాగు చేపట్టారు. భూగర్భజలాలు అడుగంటడంతో పంటలకు  సరిపడా నీరు అందటం లేదు. అదేవిధంగా వలస ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడింది. మారుమూల గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, వంకలు ఎండిపోవటంతో అక్కడే లోతుగా చెలిమలు తీసి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులుంటే మే నెలలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళనలో ప్రజలున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న భూగర్భ జలాల క్షీణత

 గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి . జిల్లాలో భూగర్భ జలాల క్షీణత రోజురోజుకు ఎక్కువవుతుది. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భజలాల వినియోగం ఎక్కువైంది. రబీలో సాగుచేసిన పంటలకు నిరంతర ఉచిత విద్యుత్‌తో సాగునీరు అందిస్తున్నారు. దీంతో భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీరు రానటువంటి పరిస్థితులున్నాయి. గుండాల, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. రబీలో సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతుంది.  వరిపంటకు నీటి ఎద్దడి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మేతకు అలమటిస్తున్న పశువులు

 వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు తగ్గిపోవటంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఒక ఎకరం మాగాణిలో వరిగడ్డి రూ.8 వేలు పలికింది. ఎండుగడ్డి కొరతతో పాటు పశువులు పొలాలకు వెళ్లి మేసేందుకు ఎక్కడా మేతలేదు. మేతకు వెళ్లిన పశువులు కనీసం తాగేందుకు వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. ఒక పశువు మేతకు రోజుకు యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులకు పశుపోషణ భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు.

మండుతున్న ఎండలు  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్‌ భగీరథ పనులు పూర్తికాకపోవటంతో తాగునీటికి గ్రామాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. తాగు, సాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవసరముంది. అదేవిధంగా పశుగ్రాసం కొరతను నివారించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పశువుల మేత, దాణా అందించాలని రైతులు కోరుతున్నారు. 
 

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top