అద్దంకి ఎంపీపీ వైఎస్సార్ సీపీ కైవసం | ysrcp won addanki mpp seat | Sakshi
Sakshi News home page

అద్దంకి ఎంపీపీ వైఎస్సార్ సీపీ కైవసం

Jul 14 2014 2:52 AM | Updated on Aug 10 2018 8:08 PM

అద్దంకి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అద్దంకి: అద్దంకి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులున్నా గత నెల 4వ తేదీన జరగాల్సిన ఎన్నిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్‌కే మస్తాన్ వలి నామినేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లడంతో వాయిదా పడింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ వ్యవహరించారు.
 
ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి వచ్చిన ఎంపీటీసీ సభ్యులు...
కో ఆప్షన్ ఎన్నిక నామినేషన్ దాఖలు సమయానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తమ పార్టీ తరఫున గెలుపొందిన 8 మంది ఎంపీటీసీలను తీసుకుని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. కో ఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మణికేశ్వరం గ్రామానికి చెందిన ఎస్‌కే మస్తాన్ వలి, టీడీపీ తరఫున ఎస్‌కే కరిముల్లా నామినేషన్లు వేశారు. అధికారులు పరిశీలన పూర్తిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్‌కే మస్తాన్‌వలి నామినేషన్ చెల్లుబాటైనట్లు ప్రకటించారు.
 
టీడీపీ అభ్యర్థికరిముల్లా నామినేషన్ ఓటర్ల జాబితాలో నంబరు సరిగా వేయని కారణంగా తిరస్కరించారు. ఒంటి గంట సమయంలో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య ఏ పార్టీకి కేటాయించిన సీట్లలో ఆ పార్టీ ఎంపీటీసీలను కూర్చోబెట్టారు. మండలంలోని 14 మంది ఎంపీటీసీ సభ్యుల చేత జేసీ యాకూబ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. పోటీ లేకపోవడంతో కో ఆప్షన్ సభ్యునిగా ఎస్‌కే మస్తాన్ వలికి నియామక పత్రం అందజేసి మూడు గంటలకు సభ్యులను సమావేశపరచాలని ఆదేశించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సమావేశం మూడు గంటలకు ప్రారంభమైంది. అక్షరక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మండల పరిషత్ అధ్యక్షురాలిగా గోరంట్ల పద్మావతి, ఉపాధ్యక్షురాలిగా కరి అరుణ పేర్లను మణికేశ్వరం ఎంపీటీసీ ఇస్తర్ల వెంకట్రావు, వెంపరాల ఎంపీటీసీ భైరపునేని రామలింగయ్యలు ప్రతిపాదించి బలపరిచారు. టీడీపీ తరఫున చిన్నకొత్తపల్లి ఎంపీటీసీ మానం సరితను, ధేనువకొండ ఎంపీటీసీ ఉయ్యాల రాములును అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ప్రతిపాదించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులెత్తారు.
 
టీడీపీ అభ్యర్థులకు ఆరుగురు ఎంపీటీసీల మద్దతు మాత్రమే లభించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా గోరంట్ల పద్మావతి, కరి అరుణ ఎన్నికైనట్లు జేసీ ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో బీ రవి, ఇన్‌చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement