కాటన్‌ రాయుడు మాట్లాడడేంటి?: రోజా

మహిళలపట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన: రోజా - Sakshi


విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. ఒకపక్క రాష్ట్రంలో మహిళలను వేధిస్తూ.. మరోవైపు మహిళా సాధికారత అంటూ చంద్రబాబు వల్లమాలిన ప్రేమ నటిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.


మహిళను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న  చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్ట పగలు కూడా నడవలేయపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలకేయుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు.



కంత్రీ కేబినెట్‌ మంత్రులు ఉన్నారు

‘దేశంలోనే నలుగురు మంత్రులపై లైంగిక ఆరోపణలున్నాయని తేలితే అందులో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన మంత్రులుండటం సిగ్గు చేటు. ఒక మహిళా కేంద్ర మంత్రిని కూడా వేధించిన చరిత్ర ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులుండటం దౌర్భాగ్యం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి నిత్యం మహిళా ఉద్యోగులను వేధిస్తున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదు.  మహిళలను హింసించేవారిని టీడీపీ పెద్దలు వెనకేసుకు వస్తున్నారు. చంద్రబాబు మంత్రులంతా కంత్రీలు, ఎమ్మెల్యేలంతా కాలకేయుళ్లు.



ఎస్టీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు మెస్‌ చార్జీలు పెంచమని విశాఖలో పోరాడితే జుట్టు పట్టి లాగారు. తుందురులో ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదించిన మహిళలను బట్టలు చించి కొట్టారు. అంగన్‌వాడీ మహిళలను బ్లౌజులు చినిగిపోయేలా కొట్టారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌తో బెదిరించి ఎంతో మంది అమాయక మహిళలను వ్యభిచారంలోకి దించేశారు. దానికి కారణమైన బోండా ఉమ,బుద్ధా వెంకన్న వంటి వారిని వెనకకేసుకు రావడమేనా మహిళా సాధికారత. కార్యకర్తల స్థాయి నుంచి మంత్రుల వరకు నిత్యం మహిళలను హింసిస్తున్నారు. దీనికి టీడీపీ మహిళా నాయకులు కూడా మినహాయింపు కాదు.



గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ టీడీపీ మహిళా నాయకులపై దాడులు చేసినా చంద్రబాబులో చలనం లేదు. జానీమూన్‌ వంటి వారు మీడియా ముందుకొచ్చి తమపై జరుగుతున్న వేధింపులపై చెప్పినా ఫలితం లేదు. ఇక నారాయణ కాలేజీలో 25 మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కేసు నమోదు చేయలేదు. మంత్రి నారాయణను కూడా భర్తరఫ్‌ చేయకుండా కొనసాగించడం దారుణం. ఆయనిచ్చే డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని దించే దిశగా మహిళలు కంకణ బద్దులు కావాలి. నరకాసురుడిని వధకు కాళికామాతలుగా రావాలి.’  అని పిలుపునిచ్చారు.



కాటన్‌రాయుడు మాట్లాడేంటి?

‘ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి రాగానే గజినిలా మరిచిపోయారు. ఎంతమందికి రుణమాఫీ చేశారు. ఇళ్లు కట్టించారు. ఏ జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముడి సరుకులతో పాటు ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది. విదేశాల నుంచి 18మందిని తీసుకు వచ్చి వాళ్ల భోజనానికి రూ.18 లక్షలు ఖర్చు చేసిన చంద్రబాబు ఇక్కడ చేనేతలు పడుతున్న కష్టం కనపడలేదు.


చేనేతలకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటున్న పవన్‌ కళ్యాణ్‌ చేనేతల సమస్యలపై ఎందుకు స్పందించడంలేదు. కాటమరాయుడు సినిమా రిలీజ్‌ సందర్భంలో తాను కాటన్‌రాయుడునని పవన్‌ పబ్లిసిటీ చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మాటిస్తే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాటిచ్చినట్లే. మాట తప్పరు, మడం తిప్పరు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే చేనేత సమస్యలను పరిష్కరిస్తారు.’ అని హామీ ఇచ్చారు


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top