గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ గుంటూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్తల బైక్‌ర్యాలీ
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ గుంటూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని హిందూ కళాశాల నుంచి ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ గుండాగిరీని నిరసించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సత్తెనపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జ్యోతుల నెహ్రూ, జలీల్‌ఖాన్‌లను గుంటూరుకు పంపారు.
ఈ ప్రతినిధి బృందం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సోమవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, ముప్పాళ్ల ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం సోమవారం ట్రైనీ కలెక్టర్ శివశంకర్, అర్బన్ ఎస్పీ జెట్టీ గోపీనాథ్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణను కలిసి టీడీపీ దౌర్జన్య కాండను వివరించింది.