
ఆస్పత్రిలో దుర్గారావు
శాంతియుతంగా నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది.
సాక్షి, ఏలూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రానికి హోదా కావాలని నిరసిస్తూ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో చోటుచేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న బంద్‌ను టీడీపీ సర్కార్ విఫలం చేసేందేకు చేసిన కుట్ర వల్లే దుర్గారావు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బుట్టాయగూడెంలో పార్టీ కార్యకర్త దుర్గారావు ఏపీ బంద్‌లో పాల్గొన్నారు.
తెల్లం బాలరాజుతో పాటు దుర్గారావు, మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా బుట్టాయిగూడెం పోలీస్‌స్టేషన్‌కు తరలించే యత్నం చేయగా తోపులాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో దుర్గారవు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంత సమయానికే దుర్గారావు చనిపోయారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం. కాగా, దుర్గారావు మృతితో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హోదా కోసం తలపెట్టిన ఏపీ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిపట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి జననేత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా పోరులో దుర్గారావు అమరుడయ్యారని పేర్కొన్నారు. శాంతియుతంగా చేపట్టిన బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం బంద్ నిర్వహిస్తోన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల బలవంతపు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. హోదా పోరాటానికి మద్దతు తెలపాల్సిన చంద్రబాబు నాయుడు ఏపీ బంద్‌ను అడ్డుకోవాలని పోలీసులు, ఉన్నతాధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. బంద్‌లో పాల్గొన్న కారణంగా మహిళలని కూడా చూడకుండా వాళ్లను ఈడ్చిపారేస్తు దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారు.