
రాజశేఖరుని స్వర్ణయుగం చూశారు: వైఎస్ జగన్
ప్రజలు రామరాజ్యం చూడలేదు కానీ రాజశేఖరుని స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
చిత్తూరు: ప్రజలు రామరాజ్యం చూడలేదు కానీ రాజశేఖరుని స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ కొనసాగిస్తున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఏర్పేడులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
రాజశేఖర రెడ్డి మండుటెండలో 1600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరించిన ఏకైక నేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. పేదవారి ఆరోగ్యం బాగుండాలనే ఆశయంతో వారి కోసం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి వైఎస్ఆర్ ఆదుకున్నారని జగన్ అన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఇప్పుడు ఏ గడ్డి తినడానికైనా రాజకీయ నేతలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తూంటే బాధేస్తోందని, ఓట్లు, సీట్ల కోసం దొంగ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే తమకు గిట్టనివారిని జైళ్లకు పంపిస్తారు, మనుషుల్నితప్పిస్తారని జగన్ అన్నారు.