
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం జనంతో పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనాభిమానం తరలివచ్చింది. ప్ర త్యర్థుల ఊహలను తలకిందులు చేసేలా అంచనా లకు మించిన జనం హాజరుకావటంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయటంతో పాటు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రగా వచ్చిన జన హృదయ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట వేలాది అడుగులు అనుసరించాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం తొలి సారిగా ఆయన ప్రసంగించనుండటంతో ఈ బహిరంగ సభకు జనప్రవాహం తరలివచ్చింది. ఒడిశా లోని రాయఘడ, గుణుపూరు ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం వచ్చి స్వచ్ఛంద మద్దతు పలకటం విశేషం.
జగన్ రాకతో మురిసిన పార్వతీపురం
పార్వతీపురం పట్టణ ముఖద్వారం జనసంద్రంతో మురిసిపోయింది. తరలివచ్చిన అభిమాన నేతను చుట్టుముట్టింది. ఆయన రాకతో పట్టణమంతా జైజగన్ నినాదాలతో హోరెత్తింది. 299వ రోజైన శనివారం పార్వతీపురం మండలం సూరంపేట వద్ద పాదయాత్ర ప్రారంభించిన జననేత నర్సిపురం మీదుగా వసుంధరానగర్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనానంతరం యర్రాకృష్ణమూర్తి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. సభ ముగిసిన అనంతరం జననేత పార్వతీపురం పట్టణ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస వద్దకు చేరుకున్నారు. జగన్‌కు తోడుగా అశేష జనవాహిని రాకతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే రహదారి కిటకిటలాడింది. రోడ్డుకు ఇరువైపులా ఏ మేడ చూసినా జనంతో కనిపించగా వారందరికీ జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ధ్వజమెత్తిన జగన్
నాలుగున్నరేళ్ల టీడీపీ హయాంలో సాగిన అవినీతి, అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోమన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తీరును తూర్పారబట్టారు. బ్యూటిఫికేషన్ పనుల నుంచి అంగన్వాడీ పోస్టులు, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ పోస్టులను అమ్ముకోవటం వరకూ అన్నింటిపైనా కడిగిపారేశారు. జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్య నటనను ఎండగట్టారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆ రెండు ప్రాజెక్టులను పూర్తిచేసి వేలాది ఎకరాలకు సాగు నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు.
2003 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతే వైఎస్సార్ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేయించారనీ, మిగిలిన పదిశాతం పనులు కూడా గడచిన నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేయించలేకపోయారని మండిపడ్డారు. సీతానగరంలో నిజాం కాలం నాటి షుగర్ ఫ్యాక్టరీ ఎన్‌సీఎస్ యాజమాన్యానికి కట్టబెట్టిన చంద్రబాబు, ఆ ప్యాక్టరీకి చెరుకు పంపిణీ చేస్తున్న రైతుల బకాయిలు రూ. 13కోట్లు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకపోవడంపై ధ్వజమెత్తారు. జిల్లాలోని 26 మండలాల్లో కరువు తాండవిస్తుంటే కేవలం నాలుగు మండలాల పేర్లు ప్రకటించి చేతులు దులుపుకోవడాన్ని తప్పుపట్టారు. పార్వతీపురం పట్టణ ప్రజలకు కనీసం తాగు నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
కుట్ర కాదని ఎలా అంటారు
విశాఖ విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఎక్కడా మాట్లాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం బహిరంగ సభలో పెదవి విప్పారు. తనపై జరిగిన కుట్ర జరగలేదని ఎలా అంటారని, సీసీ టీవీ ఫుటేజ్ మాయం నుంచి రెస్టారెంట్ యజమాని సీఎం సన్నిహితుడే కావడం వరకూ అన్నిటిలోనూ తనను మట్టుబెట్టాలనే కుట్ర ఉందని జగన్ స్పష్టం చేశారు. తన తల్లి, చెల్లిపైనా అభాండాలు వేస్తుంటే బాధేస్తోందని, ఈ కుట్రలను తలచుకున్నప్పుడల్లా తాను కలత చెందుతున్నానని జగన్ అంటున్నప్పుడు జనం ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో సభలో నిశ్శబ్దం అలముకుంది. అన్నా.. నీ వెంట మేమున్నామనే నినాదం నలుదిశలా ప్రతిధ్వనించింది. ఎన్ని కుట్రలు చేసినా. అంతమొందించాలని చూసినా తాను భయపడేది లేదని, జనం కోసం, జనంలోనే ఉంటానని జగన్ ఉద్వేగం నడుమ స్పష్టం చేశారు.
యాత్రలో వేదనలు
ప్రజా సంకల్పయాత్రలో పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి జననేతవద్ద తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. రైతులు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను తెలియజేశారు. ప్రొఫెషనల్‌కోర్సులు చదివినా ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావటం లేదని డీఈడీ విద్యార్థులు వాపోయారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నప్పటికీ తమను కాదని, గిరి జనేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారని గిరిజన ని రుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేసింది. ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ జిల్లాకు చెందిన యువకులు విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన విషయం తెలుసుకుని చలించిపోయామని జననేత వద్ద పేర్కొన్నారు.
పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెం టరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట నియోజకవర్గాల సమన్వయకర్తలు అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, డీసీసీబీ ఛైర్మన్ మరిశర్ల తులసి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, పార్టీ నాయకులు జమ్మా న ప్రసన్నకుమార్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.