అదే ఆదరణ

YS Jagan Padayatra Reaches 3600 Kilometres - Sakshi

జనహోరులో జగన్‌ పాదయాత్ర

 3600 కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్‌

ఒక్కరోజులో  13.6 కిలోమీటర్ల మేరకు సాగిన యాత్ర  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆయన అడుగుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదు. ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 3600 కిలోమీటర్లు మైలురాయిని దాటేసి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. వన్నె తగ్గని ప్రజాదరణతో జనహోరు నడుమ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోంపేట మండలంలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం ఉదయం సోంపేట మండలం తురక శాసనం నుంచి పాదయాత్ర ప్రారంభించి, లక్కవరం కూడలి వరకు నిర్వహించారు. ప్రజాసంకల్పయాత్ర ముగిం పు దశకు రానుండడంతో వెంట వచ్చే జనం రోజు రోజుకూ రెట్టింపవుతున్నారు.

యాత్ర పొడవునా వందలాది మంది ప్రజలు తమ సమస్యలను, వ్యక్తిగత ఇబ్బందులును జగన్‌తో చెప్పుకున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటూ భవి ష్యత్‌పై భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగారు. పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో ప్రధానంగా నవరత్నాల పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజల్లో నవరత్నాల అమలు, ప్రాధాన్యతపై అవగాహన పెంచేలా ప్రదర్శన చే యించా రు. అలాగే యాత్ర ప్రారంభమైన తురకశాసనం నుంచి లక్కవరం క్రాస్‌ వరకు ప్రత్యేకంగా చతురశ్వాల ఆహ్వానంతో పాటు కోయ డాన్సులు, పలు సంప్రదాయ నృత్యాల సందడి కొనసాగింది.

పాదయాత్ర సాగిందిలా
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం సోంపేట మండలం తురకశాసనం నుంచి పాదయాత్ర ప్రారంభమై, పాలవలస క్రాస్, కొర్లాం, బారువ కూడలి మీదుగా లక్కవరం కూడలి వరకు యాత్ర సాగింది. అడుగడుగునా వందలాది మంది జనం తమ సమస్యలను జగన్‌కు వివరించారు. సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు, ఆటో కార్మికులు, సీపీఎస్‌ బాధితులు, ఆశ వర్కర్లు, ఐక్యదళిత మహానాడు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి తమ వినతులను సమర్పించారు. అలాగే తిత్లీ తుపాను బాధితులు కూడా తమకు జరిగిన నష్టాలకు తగిన పరిహారాలను ప్రభుత్వం అందివ్వలేదంటూ జగన్‌ వద్ద వాపోయారు. అలాగే ఉల్లి రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేదంటూ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ వాపోయారు.

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల ప్రజలకు సాగునీటి వనరుగా ఉన్న పైడిగాం ప్రాజెక్టు తిత్లీ తుపానుతో ధ్వంసమైందని, దీన్ని పునరుద్ధరించాలని జగన్‌ను పలువురు రైతులు విన్నవించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాలను కల్పిస్తామని జగన్‌ ప్రకటించడంపై ఐక్య దళిత మహానాడు ప్రతినిధులు హర్షం ప్రకటించారు. అలాగే వడ్డెర, చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు జగన్‌ చేతుల మీదుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరింపజేశారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా వడ్డెర, చేనేతలకు దివంగత వైఎస్సార్‌ చేసిన మేలు, అలాగే జగన్‌ ఈ కులాలకు ఇచ్చిన అవకాశాలను ప్రజలకు తెలియజేసేలా చేస్తామని గుంటూరు చెందిన ప్రతినిధులు తెలియజేశారు.

పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ పాదయాత్రకు పలువురు నేతలు అడుగులు వేస్తూ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇఛ్చాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, ఇఛ్చాపురం, పలాస, టెక్కలి సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే నరేష్‌ కుమార్‌ అగర్వాల్, ప్రముఖ సినినటుడు విజయచందర్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షుడు చింతాడ మంజు, పలాస పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌ (బాబా), అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ జిల్లా కన్వీనర్‌ దువ్వాడ శ్రీకాంత్,  రాష్ట్ర పార్టీ వివిధ విభాగాల కార్యదర్శులు నర్తు రామారావు, తమ్మినేని చిరంజీవి నాగ్, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.   

3600 కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌
2017 నవంబర్‌ 6న మొదటి కిలో మీటర్‌ మైలురాయిని దాటిన జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర దారిపొడవునా పలు ప్రాంతాల్లో కీలక మైలురాళ్లను దాటింది. ఇందులో భాగంగా శనివారం సోంపేట మండలం బారువ కూడలి వద్ద 3600 కిలోమీటర్లను దాటారు. ఈ సందర్భంగా ఈ కూడలిలో జగన్‌ ప్రత్యేకంగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అనంతరం యాత్ర పొడవునా పలువురు వృద్ధులు, మహిళలు జగన్‌తో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘అన్నా..నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండన్నా.. నువ్వు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారంటూ..’ పలువురు జగన్‌ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ ‘మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలేæ నాకు ఇన్ని మైలురాళ్లు దాటేంత శక్తి ఇస్తున్నాయని’ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top