అసెంబ్లీ సాక్షిగా కుమ్మక్కు కుట్ర: వైఎస్ జగన్ | ys jagan mohan reddy slams congress party over Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా కుమ్మక్కు కుట్ర: వైఎస్ జగన్

Jan 21 2014 2:47 AM | Updated on Jul 29 2019 5:31 PM

చివరకు పిల్లనిచ్చిన సొంత మామను కూడా పదవికోసం వెన్నుపోటు పొడవడానికి వెనుకాడని

* సమైక్య శంఖారావం సభలో నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
* అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాల్సిందిపోయి.. రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చర్చిస్తున్నారు..
* సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా.. సీఎం సీటు కోసం కిరణ్ నాటకాలాడుతున్నారు
* అధికారపక్షంతో అంటకాగుతూ చంద్రబాబు    విభజనకు తనవంతు సహకారమందిస్తున్నారు
* మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించేందుకు అసెంబ్లీలో కుట్ర సాగుతోంది

 
 చంద్రబాబు చందమామనూ తెచ్చిస్తానంటారు..
చివరకు పిల్లనిచ్చిన సొంత మామను కూడా పదవికోసం వెన్నుపోటు పొడవడానికి వెనుకాడని చంద్రబాబు నేడో రేపో తాను అధికారంలోకి వస్తే చందమామను తెచ్చిపెడతాననో.. హైదరాబాద్ నగరానికి సముద్ర తీరాన్ని తెస్తాననో చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా చంద్రబాబు ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా జనం నమ్మరు. అయితే ఈ రోజు నేను గర్వంగా చెప్పగల్గుతున్నా.. ‘జగన్ చెప్పింది చేస్తాడు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతాడు’ అన్న నమ్మకం సంపాదించుకోగలిగా. ప్రియతమ నాయకుడు, దివంగత నేత వైఎస్ నుంచి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను సంతరించుకున్నానని నేను గర్వంగా చెప్పగలను.
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యలను పక్కనపెట్టి, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని అసెంబ్లీలో పాలక, ప్రతిపక్ష నేతలు చేస్తున్న చర్చలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సోనియా గీచిన గీత దాటకుండా.. ఎంతకాలం వీలైతే అంతకాలం సీఎం కుర్చీలో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి తాపత్రయ పడుతుంటే.. మరోవైపు అధికారపక్షంతో అంటకాగుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు చంద్రబాబు తనవంతు సహకారాన్ని అందిస్తున్నారంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
  ‘‘ఇంతగా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరీ మరీ గుర్తుకొస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పిన వైఎస్ జీవించి ఉంటే మన రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరైనా చేయగలిగేవారా?’’ అని అన్నారు. దిగజారుడు, కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడి ‘సమైక్య రాష్ట్రం’ దక్కించుకునే కృషిలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ను జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. తొలిరోజు యాత్రలో భాగంగా ఆయన వడవాలపేట, పుత్తూరు సభల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ప్రతి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర..

 ‘‘కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడు.. జై సమైక్యాంధ్ర. ప్రతి రైతన్న మదిలో మెదిలే ఒకే ఒక మాట జై సమైక్యాంధ్ర. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీరు తప్ప మంచినీరు లభించని ప్రమాదపుటంచున ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు సమైక్యాంధ్ర. ఇందరి మనోభీష్టానికి వ్యతిరేకంగా సీట్లు, ఓట్ల కోసం నేడు కుమ్మక్కు కుట్రతో రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సారి టీవీ పెట్టి అసెంబ్లీ సమావేశాల చర్చ చూస్తే.. రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది. ఓట్లు, సీట్ల కోసం ఎంత నీచానికైనా పాల్పడే పరిస్థితులు ఉన్నాయి.
 
  సోనియా గాంధీ గీచిన గీత దాటకుండా ఎంత కాలం వీలైతే అంత కాలం సీఎం కుర్చీలో ఉండేందుకు కిరణ్ కుమార్‌రెడ్డి జనాన్ని మోసం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతమంతా సమైక్యం కోసం ఒక్క గొంతుతో నినదిస్తున్న వేళ.. ఆయన ఉద్యోగులను బెదిరించి సమ్మె విరమింపజేశారు. ఢిల్లీ నుంచి బిల్లు రాగానే ఆగమేఘాలపై తాను సంతకం చేయడమే కాక మిగతా ప్రభుత్వ కార్యదర్శులతో సంతకాలు చేయించి 17 గం టల్లోనే బిల్లును అసెంబ్లీకి పంపారు. ఇలా విభజన కోసం చేసేవన్నీ చేస్తూ కిరణ్ కుమార్‌రెడ్డి పైకేమో సమైక్యవాది ముసుగుతో జనాన్ని మోసం చేస్తున్నారు.
 
 కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు..
 మన ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలలో సీమాంధ్ర వారిచేత సమైక్యాంధ్ర అనిపిస్తారు... తెలంగాణ వారిచేత విభజన మాట పలికిస్తారు. అయ్యా చంద్రబాబూ.. విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖను ఎందుకు వెనక్కు తీసుకోరు? ఇంత వరకూ సమైక్యమన్న మాటే మీ నోటి వెంట ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నా. రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చే ప్రయత్నం చేస్తున్న సోనియాను, కిరణ్‌కుమార్ రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ పని చేయకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపే హామీలనిస్తున్నారు.
 
 ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తానంటూ ‘ఆల్ ఫ్రీ బాబు’గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండగా కరువు రైతుల అప్పులపై వడ్డీ మాఫీచేయని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే మొత్తం అప్పులే రద్దు చేస్తారట. హార్స్‌పవర్ విద్యుత్ చార్జీలు రూ.50 నుంచి రూ.625కి పెంచిన చంద్రబాబు, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అన్న చంద్రబాబు.. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారట. ఎన్నికల ముందు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఆయన... అధికారంలోకి రాగానే మద్యనిషేధం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని ‘ఈనాడు’లో పెద్ద పెద్ద వార్తలు రాయించుకున్నారు. చివరకు ఊరూరా బెల్టుషాపులు వెలిసేలా చేశారు.
 
 సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం..
 ఢిల్లీ అహంకారానికి, తెలుగు వాడి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరులో.. కుటిల, కుమ్మక్కు రాజకీయాలకు తగిన బుద్ధి చెపుదాం. త్వరలో ఎన్నికలు వస్తాయి. మనమే సొంతంగా 30 మంది ఎంపీలను గెలిపించుకుందాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం. రాష్ట్రాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేసిన సోనియాకు, సీఎం పదవికోసం ఆమె గీచిన గీత దాటని కిరణ్‌కు, కుమ్మక్కు రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా బలంగా సమైక్య నినాదాన్ని వినిపిద్దాం.’’
 
 తొలిరోజు యాత్ర ఇలా..
 సోమవారం ఉదయం 8.50 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మొదలైంది. గాజుల మండ్యం, కదిరి మంగళం మీదుగా 12.30 గంటలకు బ్రాహ్మణ పట్టు గ్రామం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పత్తిపుత్తూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం 3.30గంటలకు అప్పలాయకుంటలోని ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమంద్యం మీదుగా వడమాలపేట చేరుకుని సభలో ప్రసంగించారు. అనంతరం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పుత్తూరు సభలో ప్రసంగించారు. సోమవారం యాత్రలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అమరనాథ రెడ్డి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త రోజాతో పాటు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా నేతలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, బియ్యపు మదుసూదన రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement