
సాక్షి ప్రతినిధి, అనంతపురం
ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం వరకూ దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఆరు నెలల పాటు సాగే ఈ యాత్రలో ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ.. రాష్ట్రంలో సాగుతున్న ప్రజావ్యతిరేక పాలన గురించి అందరికీ వివరిస్తానన్నారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన ‘యువభేరి’లో జగన్ మాట్లాడుతూ పాదయాత్ర గురించి ప్రస్తావించారు.
‘నవంబర్ 2 నుంచి నేను పాదయాత్ర ప్రారంభిస్తున్నా.. యువభేరిలో పాల్గొనకపోవచ్చు. ఇప్పటికే 10 జిల్లాల్లో ఆ కార్యక్రమం నిర్వహించాం. ఇకపై ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నా. వారు వారి పరిధిలోని ప్రతీ కాలేజీకి వెళ్లి యువభేరి నిర్వహిస్తారు. పాదయాత్రలో కూడా ప్రత్యేక హోదా గురించి వివరించి ప్రజల మద్దతు కూడగడతా. జగన్ ఒక్కడే ఏమీ చేయలేడు. మీ అందరి తోడ్పాటు ఉంటే ఏదైనా సాధ్యమే’ అన్నారు.