పార్టీలకు అతీతంగా కదలిరండి: ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు | YS Jagan calls MLAs to support to Samaikyandhra | Sakshi
Sakshi News home page

పార్టీలకు అతీతంగా కదలిరండి: ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు

Dec 19 2013 6:04 PM | Updated on Jul 29 2019 5:31 PM

పార్టీలకు అతీతంగా కదలిరండి: ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు - Sakshi

పార్టీలకు అతీతంగా కదలిరండి: ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు

రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం ఎమ్మెల్యేలు అందరూ పార్టీలకు అతీతంగా కదలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు.

హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం ఎమ్మెల్యేలు అందరూ పార్టీలకు అతీతంగా కదలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమైక్యానికి అనుకూలంగా ఎమ్మెల్యేలు అందరూ అఫిడవిట్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇద్దాం రమ్మని కోరారు. అందరికి పేరుపేరున నమస్కరించి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై  అసెంబ్లీలో ఒక వేళ ఓటింగ్ పెట్టినా పెట్టకపోయినా ఈ అఫిడవిట్లు ఇద్దాం రమ్మన్నారు. ఇక్కడ జరిగే కుళ్లు కుతంత్రాలు, కుమ్మక్కు రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు అందరూ వారివారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని కోరారు.  పార్టీలకు అతీతంగా మన దగ్గరికే వచ్చిన రాష్ట్రపతిని కలిసి సమైక్యానికి అనుకూలంగా అఫిడవిట్లు ఇద్దామన్నారు.

తమ పార్టీకి లోక్సభలో బలం తక్కువగా ఉన్నా ప్రతిరోజూ ఆందోళలు చేసినట్లు తెలిపారు.  లోక్సభ సమావేశాలకు తమ పార్టీ సభ్యులు ముగ్గురం ప్రతిరోజూ హజరై ఒకే మాటపై నిలబడినట్లు చెప్పారు.  రాష్ట్రానికి జరిగే అన్యాయం దేశం మొత్తానికి తెలియడం కోసం లోక్సభలో ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేశామన్నారు. వాయిదా తీర్మానాలు, అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు చివరి రోజు టిడిపి నేతల ప్రవర్తన బాధ కలిగించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన  నలుగురు ఎపిలు ఒక రకంగా మాట్లాడితే, మరో ఇద్దరు మరో రకంగా మాట్లాడారని విమర్శించారు. నలుగురు ఎంపిలు ముందుకు వస్తే, ఇద్దరు ఎంపిలు రారని చెప్పారు. టిడిపి ఎంపిల వైఖరి చూసి స్పీకర్ నవ్వుకున్నారన్నారు.  అసదుద్దీన్ ఓవైసీ కూడా నవ్వారని చెప్పారు.

అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు  అదే వైఖరి అవలంభించారన్నారు. అసెంబ్లీకి వచ్చి తన గదిలో కూర్చుంటారు గానీ, అసెంబ్లీ హాలులోకి మాత్రం రారని చెప్పారు. ఒక్కసారి మాత్రం నెల్సన్ మండేలా మృతికి సంతాపం తెలపడం కోసం వచ్చారన్నారు. 8 రోజుల్లో బిఏసి రెండు సార్లు సమావేశం అయింది. చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్కసారి కూడా హజారు కాని విషయా్న్ని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనన్నారు. సమైక్య ముసుగులో ఉన్న విభజన వాది అన్నారు.  ఉద్యోగుల చేత సమ్మె విరమింపజేశారని గుర్తు చేశారు. అవకాశం ఉన్నా సీఎం అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మానం చేయలేదని చెప్పారు. ఆయన విభజనకు వ్యతిరేకం అని చెబుతారు. తెలంగాణ బిల్లుపై మాత్రం సంతకాలు చేస్తారని చెప్పారు. బిల్లు వచ్చిన తరువాత 17 గంటల్లో బిల్లుపై సంతకం చేసి సభకు పంపించారన్నారు. బిల్లు చర్చకు వచ్చే సమయంలో ముఖ్యమంత్రి రారు. స్పీకర్ రారు. ఉప సభాపతితో సభ నడిపిస్తారని చెప్పారు. అంతా నాటకీయంగా జరిపించేస్తారని విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులను నమ్ముకోవద్దని, ఎమ్మెల్యేలు తమ  మనస్సాక్షికి అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. అఫిడవిట్లు రాష్ట్రపతికి ఇవ్వడానికి రావాలని కోరారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఎవరు ఉంచుతారో వారినే ప్రధానిని చేస్తామని తాము హైదరాబాద్ సభలో లక్షల మంది సమక్షంలో చెప్పామని, అదే మాటకు కట్టుబడి ఉన్నామని జగన్ తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం  చివరిని నిమిషం వరకు నిజాయితో గట్టిగా పోరాడతామని చెప్పారు.  రాష్ట్రం విడిపోతే  దేశంలో రెండవ అతి పెద్ద జాతి అయిన తెలుగుజాతి విచ్చిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బడ్జెట్ విషయంలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. విడిపోతే ఒక రాష్ట్రం 8వ స్థానం కోసం, మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీపడుతుందన్నారు.  రెండు రాష్ట్రాలు నాశనమైపోతాయని హెచ్చరించారు. ఎయిర్పోర్టులు, సీపోర్టులు కలసి ఉంటే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement