ఇంతకీ ఆ లిక్కర్ డాన్ ఎవరు?

ఇంతకీ ఆ లిక్కర్ డాన్ ఎవరు?


మద్యం దందా వ్యవహారంలో రాష్ట్రం దృష్టినే ఆకర్షించిన జిల్లాను ఇప్పుడు గోవా మద్యం రాకెట్ వ్యవహారం కుదిపేస్తోంది.  సుంకం చెల్లించని గోవా మద్యం యథేచ్ఛగా జిల్లాలోకి దిగుమతి అవుతున్న విషయాన్ని మూడు నెలల క్రితమే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఆరుగురుని పట్టుకున్నారు. ఆ తరువాత దీని వెనుక ఉన్న అసలైన వ్యక్తి ఎవరన్నదానిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో అసలు విషయం బయటకురాలేదు. ఇదే సమయంలో ఆ ముఠా సభ్యులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను చెరువులు, నూతుల్లో పడేశారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్న అసలు డాన్ ఎవరన్న విషయం చర్చినీయాంశమైంది.



జిల్లాలో లిక్కర్ డాన్ ఎవరన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లిక్కర్ వ్యాపారంతో తనకు సంబంధాలున్నాయని మీడి యా ముందు ఆయన చెప్పకనే చెప్పారు. మద్యం మాఫియా అంతా ఆయన కనుసన్నల్లోనే నడిచింది. రాజకీయాలను శాసిం చినట్టే మద్యం వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని దందా చేశారు. అయితే ఇప్పుడు జిల్లాను కుదిపేస్తున్న సుంకం చెల్లించ ని గోవా మద్యం వ్యవహారంలో డాన్ ఎవరన్న విషయం ఎక్సైజ్ అధికారులకు సవాల్‌గా మారింది. ఆ దిశగా కేసును విచారణ చేయకపోవడం వల్లే గోవా మద్యం రాకెట్ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

 

ఈ ఏడాది జనవరి  21న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో సుంకం చెల్లించిన 10 గోవా మద్యం బాటిళ్లతో సుధాకర్ అనే వ్యకి ఎక్సైజ్ అధికారులకు చిక్కాడు. సుధాకర్ ఇచ్చిన సమాచారంతో  వరప్రసాద్, రామకృష్ణ, జగదీష్, అర్జున్, ఆచారి అనే వారిని అరెస్టు చేశారు. వీరిని లోతుగా విచారణ చేసిన తర్వాత గోవా నుంచి సుంకం చెల్లించని మద్యం బెంగళూరు మీదుగా కర్నూలు జిల్లాకు చేరుకుని, అక్కడి నుంచి రాష్ట్ర నలుమూలలా సరఫరా జరుగుతోందని తేలింది. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జునరెడ్డి సూత్రధారిగా ఉన్నారని, రావులపాలేనికి చెందిన వాసు అనే వ్యక్తి ఏజెంట్‌గా వ్యవహరించి ఉత్తరాంధ్ర జిల్లాలకు దిగుమతి చేస్తున్నట్టు విచారణలో తేలింది.

 

వీరి ద్వారా ఒక్క విజయనగరం జిల్లాకే రెండు లారీల మద్యం వచ్చినట్టు పోలీసుల దృష్టికొచ్చింది. ఇదే తరహాలో మిగతా ప్రాంతాలకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా అయినట్టు తెలిసింది. అంతేకాకుండా నిందితుల నుంచి 108 కేసులను స్వాధీనం చేసుకుని, కేవలం 10 బాటిళ్లు మాత్రం లభ్యమయ్యాయని కేసు నమోదు చేశారన్న అభియోగంతో ఇద్దరు సీఐలను, ముగ్గురు ఎస్‌ఐలను యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు. అక్కడితో కేసు ముందుకు సాగలేదు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు చెరువు, నూతిలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు తప్ప, ఎక్సైజ్ అధికారులు ఈ కేసులో ఛేదించిన విషయాలు ఏమీ లేవు.

 

అంత ధైర్యంతో గోవా మద్యాన్ని ఎలా రవాణా చేయగలిగారు? జిల్లాలో ఎవరికి సరఫరా చేశారు ? దీని వెనుక ఉన్న పెద్దలెవరు? అన్న కోణంలో విచారణ జరగలేదు. ఎంతసేపూ కర్నూలుకు చెందిన మల్లికార్జునరెడ్డి, రావులపాలెం వాసు పాత్రపైనే ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. దీంతో మద్యం సిండికేట్ కేసు మాదిరిగానే ఇదీ పక్కదారి పట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులకు ఎటువంటి ఆధారం లభించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అప్పటికే దిగుమతైన గోవా మద్యాన్ని మారుమూల ప్రాంతాల్లోని చెరువులు, బావుల్లో  దాచి ఉంచినట్టు తెలిసింది.



ఎక్సైజ్ అధికారుల దృష్టి మరలిన తరువాత వెలికితీద్దామనో, లేదంటే ఏకంగా వదిలేద్దామనో తెలియదుగానీ గుట్టుగా దాచి ఉంచేశారు. ఈ నేపథ్యంలో గురువారం జామి మండలం అలమండలోని ఓ చెరువులోనూ, శుక్రవారం కొత్తవలస మండలం రాజవానిపాలెంలోని మామిడితోటలో ఉన్న బావిలోనూ గోవా మద్యం బాటిళ్లు వెలుగు చూశాయి. ఇప్పుడు వాటిని వెలికి తీస్తున్నారు. ఈ రెండుచోట్లే కాదు ఎస్.కోట, కొత్తవలస, జామి, లక్కవరపుకోట చుట్టు పక్కల చెరువుల్లో కూడా ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

 

  చెరువులు, బావుల్లోని గుట్టు బయటికి రావాలంటే ఈ కేసులో పాత నిందితుల్ని విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలియగానే కేసులో బెయిల్‌పై బయట ఉన్న  సుధాకర్ అదృశ్యమయ్యాడు. ఇప్పుడతని కోసం గాలిస్తున్నారు. సుధాకర్ దొరికితే ఇంకెంత మద్యం బయటపడుతుందో చూడాలి. అయితే, ఇదే సందర్భంలో  తెరవెనుక ఉన్న బడా వ్యక్తులెవరో తేలవలసి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top