కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా? | who is new collector girijasankar.. yuvaraja? | Sakshi
Sakshi News home page

కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా?

Dec 30 2014 3:12 AM | Updated on Mar 21 2019 8:35 PM

కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా? - Sakshi

కొత్త కలెక్టర్.. గిరిజాశంకరా.. యువరాజా?

ఐఏఎస్‌ల విభజన లో సిద్ధార్థ్‌జైన్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి నేడో రేపో సిద్ధార్థ్‌జైన్ రిలీవ్ కానున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఐఏఎస్‌ల విభజన లో సిద్ధార్థ్‌జైన్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి నేడో రేపో సిద్ధార్థ్‌జైన్ రిలీవ్ కానున్నారు. ఆయన స్థానంలో కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీ యాంశంగా మారింది. గతంలో జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజాశంకర్, తిరుమల జేఈవోగా పనిచేసిన ఎం.యువరాజు పేర్లను కలెక్టర్‌గా నియమించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌ల విభజన అనివార్యమైంది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష కమిటీ తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇది పసిగట్టిన సిద్ధార్థ్‌జైన్ తనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును పలు సందర్భాల్లో కోరా రు. చంద్రబాబు మనసు గెలుచుకునేందుకు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు అధికారవర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆర్నెల్లలో ఆయన పనితీరే అందుకు తార్కాణమని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు చెబుతున్నాయి.

సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించేలా చంద్రబాబు చేసిన సూచనను కేంద్రం ఖాతరు చేయలేదు. తెలంగాణకే కేటాయిస్తున్నట్లు కేంద్రం తెగేసి చెప్పడంతో సిద్ధార్థ్‌జైన్ జిల్లా కలెక్టర్‌గా రిలీవ్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజాశంకర్ గతంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం మహబూబ్‌నగర్‌జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గిరిజాశంకర్‌ను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించింది. సమర్థుడైన అధికారిగా పేరున్న గిరిజాశంకర్‌ను జిల్లా కలెక్టర్‌గా నియమించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తిరుమల జేఈవోగా పనిచేసి.. ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.యువరాజు పేరు జిల్లా కలెక్టర్‌గా తెరపైకి వచ్చింది. హుద్‌హుద్ తుఫాను సహాయక చర్యల్లో ఎం.యువరాజు సమర్థవంతంగా పనిచేశారనే అభిప్రాయంతో ఉన్న సీఎం చంద్రబాబు.. జిల్లా కలెక్టర్‌గా ఆయనను నియమించే దిశగా ఆలోచిస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన 2004 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.ప్రద్యుమ్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిస్థితులపై సమగ్రంగా అవగాహన ఉన్న గిరిజాశంకర్‌నే కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. జిల్లా కలెక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement