కరెంట్‌పై సహకరిస్తా: బాబు | Sakshi
Sakshi News home page

కరెంట్‌పై సహకరిస్తా: బాబు

Published Wed, Mar 4 2015 1:20 AM

కరెంట్‌పై సహకరిస్తా: బాబు - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయంపై చర్చించేందుకు తెలంగాణ సర్కారే ముందుకు రావాలన్నారు. కృష్ణపట్నం, ఇతర ప్రాజెక్టులపైనా చర్చించుకుందామని, అవసరమైతే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుందామని సూచించారు. ‘తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమావేశం’ పేరిట కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం టీడీపీ నేతలు బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబుతోపాటు తెలంగాణ టీడీపీ ప్రముఖులంతా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి గతంలో తాను చేపట్టిన కార్యక్రమాలు, టీడీపీ కార్యకర్తలు చేసిన త్యాగాలను ఏకరవు పెట్టారు.

 

తాను ఇకపై టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతానని, తెలంగాణలో టీటీడీపీ తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అని, వాటి అమలుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలంతా తన స్కూల్ వారేనని, టీడీపీలోనే వారంతా శిక్షణ పొందారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ టీడీపీ తిరుగులేని శక్తిగా మారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
 
 విద్యుత్‌పై చర్చించుకుందాం
 
 తెలంగాణలో విద్యుత్ కొరత సమస్యను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘నేను దారిలో వస్తుంటే చూశాను. ఇక్కడి ప్రభుత్వం పంటలు వేయొద్దని చెప్పడంతో రైతులు ఎక్కువగా పంటలు వేయలేదు. కరెంటు విషయంలో సహకరించేందుకు మేం సిద్ధం. కృష్ణపట్నం సహా ఇరు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్రాజెక్టులపై చట్టప్రకారం మాట్లాడుకుందాం. కుదరకపోతే ఒక కమిటీని వేసి వాళ్లు చెప్పినట్లు విందాం. ప్రస్తుతం గ్యాస్ ధర తగ్గింది. గ్యాస్ పూలింగ్‌లో అవసరమైతే ఏపీకి రావాల్సిన వ్యాట్‌ను కూడా వదులుకుంటాం. తద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటే బయటికంటే తక్కువకే కరెంట్ అందుబాటులోకి వస్తుంది’ అని ఏపీ సీఎం ప్రతిపాదించారు. ఇక రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, సర్వశక్తులూ ఒడ్డాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.
 
 కరెంట్‌పై అఖిలపక్షానికి సిద్ధమా?
 
 అంతకుముందు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్  ప్రభుత్వంలో సామాజిక న్యాయం లోపించిందని, అగ్రకులాల వారికే ప్రాధాన్యముందని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన కరెంటు వాటాను ఏపీకి తన్నుకుపోయారంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను నిర్ధారించేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ఆరోపణలు నిజమని తేలితే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి కరెంట్ ఇప్పిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని గగ్గోలు పెట్టిన టీఆర్‌ఎస్ నేతలు అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు.  దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. అప్పుడు ఓట్లేసిన దళితులే ఇప్పుడు కేసీఆర్ అంతుచూసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇందులో భాగంగా ఈనెల 9న ఇందిరాపార్క్ వద్ద ‘ధూంధాం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నెల 23న మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎల్.రమణ ప్రకటించారు.
 
 ఎమ్మార్పీఎస్ నిరసనలు
 
 టీడీపీ సభకు ఎమ్మార్పీఎస్ సెగ తగిలింది. సరిగ్గా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో సభా వేదిక ముందు ప్రత్యక్షమైన ఎమ్మార్పీస్ కార్యకర్తలు.. ‘చంద్రబాబు డౌన్ డౌన్, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తక్షణమే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లజెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంలో చంద్రబాబు స్పందిస్తూ.. వర్గీకరణకు తాము అనుకూలమేనని, అనవసర రాద్ధాంతం చేయొద్దని అన్నారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ‘టీఎన్‌ఎస్‌ఎఫ్’ పేరుతో పచ్చ టీషర్టులు ధరించిన తెలుగు తమ్ముళ్లు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దారు. చివరకు పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కరీంనగర్‌లో ఆయన బస చేసిన హోటల్ వద్దే ముందస్తుగా అరెస్టు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement