మా సత్తా చూపించే రోజు దగ్గర్లోనే.. | we will fight back again on sarkar, says krishnaiah | Sakshi
Sakshi News home page

మా సత్తా చూపించే రోజు దగ్గర్లోనే..

Dec 15 2013 1:36 AM | Updated on Jul 29 2019 5:31 PM

స్వతంత్ర భారతదేశంలో బీసీలను బిచ్చగాళ్లు చేశారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కూడా ఇవ్వలేదు.

 ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
 
 సాక్షి, హైదరాబాద్: ‘స్వతంత్ర భారతదేశంలో బీసీలను బిచ్చగాళ్లు చేశారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కూడా ఇవ్వలేదు. అసలు రాజ్యాంగ రచన సమయంలోనే అన్యాయం చేశారు. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా చూశారు. అన్ని రంగాల్లో వాటా దక్కకుండా చారిత్రక అన్యాయం జరిగింది.
 
 అవమానాలు, అణచివేతలనే ఈ దేశం బీసీలకు కానుకగా ఇచ్చింది. అందుకే ఈ సమాజంపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం. మాకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దాని కోసం ఎక్కడా వెనక్కితగ్గం. మా సత్తా ఏంటో చూపించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు 2014 ఎన్నికల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించాల్సిందేనని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఆయా పార్టీలను రాజకీయంగా సమాధి చేసేందుకు కూడా వెనుకాడమని ఆయన హెచ్చరించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ‘సింహగర్జన’ బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’కి ఆర్. కృష్ణయ్య ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివి..


 బీసీలకు తగిన ప్రాతినిధ్యముందా?


 కులం అనే సామాజిక పునాదిపై ఏర్పడ్డ భారతదేశంలో సగానికి పైగా జనాభా వెనుకబడిన వర్గాలది. ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తోన్న ఈ వ్యాపార, ధనస్వామ్యంలో మా వాటా ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పటికీ చట్టసభల్లో 15 శాతానికి మించిన ప్రాతినిధ్యం లేదు. దేశంలో 2,300 కులాలుంటే 2,200 కులాలు పార్లమెంటులో అడుగుపెట్టలేదు. కులం పునాదులపై ఏర్పడ్డ ఈ దేశంలో కులమే పేదరికానికి కారణమయింది. సమాజంలో వస్తున్న మార్పులకు తగినట్లు బీసీలకు వాటా దక్కడం లేదు. అందుకే ఈ సమాజంపై పోరాటం చేస్తున్నాం.
 
 మేం ఓట్లేస్తేనే సీఎం, పీఎంలు అవుతారు
 
 మేం ఓట్లేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మేం ఓట్లేస్తేనే సీఎం, పీఎంలు అవుతున్నారు. మేం కష్టపడి పనిచేస్తేనే దేశ సంపద వృద్ధి అవుతోంది. మేం పన్నులు కడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లు రూపొందిస్తున్నాయి. ఇందులో మా వాటా ఏది? ప్రతి పౌరునికి అప్పుందని అప్పుల్లో వాటా చూపిస్తారు. కానీ మాకు ఆస్తులు, అధికారంలో వాటా ఇవ్వరా? ఈ సమాజం, పార్టీలు బీసీలకు రుణపడి ఉన్నాయి. అయితే, మేం చేస్తున్నది కుల పోరాటం కాదు. కుల నిర్మూలన ఉద్యమం. ఎందుకంటే రాష్ట్రం, దేశంలోని అన్ని బీసీ కులాలు అభివృద్ధి చెందాలని ఉద్యమిస్తున్నాం. అసలు బీసీల్లో కులతత్వం లేదు. అగ్రవర్ణాల్లోని కులతత్వం మాలో ఉంటే ఎప్పుడో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి వచ్చేవాడు.
 
 పార్టీలకు సూట్‌కేసుల పిచ్చి
 
 రాజకీయ పార్టీలు పేరుకే కానీ ఉన్నవన్నీ కుల పార్టీలే. సూట్‌కేసులు తీసుకుని టికెట్లివ్వడం ద్వారా రాజకీయాలను ఖరీదు చేసేశారు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలకు టికెట్లిచ్చి బీసీలకు అధికారాన్ని అందని ద్రాక్ష చేశారు. పార్టీలకు సూట్‌కేసుల పిచ్చి పట్టింది. ఈ సమాజంలో రాజ్యాధికారం ఉంటేనే గౌరవం. అది లేని కులాలు బానిసలే. అందుకే మేం బానిసలుగా ఉండదల్చుకోలేదు. అధికారంలో వాటా దక్కినప్పుడే ఆత్మగౌరవం నిలబడుతుంది. మొదట్లో తాము ఓటేయడానికి పుట్టామని బీసీలు అనుకున్నారు. రెండోదశలో ఓటంటే తెల్లకాగితం అనుకున్నారు. కానీ ఇప్పుడు బీసీల అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఓటంటే సీఎం, పీఎం అని భావిస్తున్నారు. ఈ మార్పును గమనించకపోతే రాజకీయ పార్టీలు చివరి ఘడియలు లెక్కపెట్టుకోవాల్సిందే. మాకు వాటావద్దు.. కోటా వద్దు.. ఢిల్లీ కోట కావాలి.. ఓట్లు మావే సీట్లు మావే. మర్యాదగా మావాటా మాకివ్వండి. లేదంటే మేమే రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతాం.
 
 సింహగర్జనకు  భారీగా తరలిరండి
 
 హైదరాబాద్, న్యూస్‌లైన్:  నిజాం కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించే బీసీల సింహగర్జనకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సభను బీసీలు ఆత్మగౌరవ సభగా భావించి ఇంటికి ఒక మనిషి, జిల్లాకు ఒక బస్సు చొప్పున తరలిరావాలని సూచించారు. బీసీల సమస్యలపై తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించేందుకే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈ సభకు ఆహ్వానించినట్లు తెలిపారు. కృష్ణయ్యతోపాటు ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, జైపాల్‌యాదవ్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణలతో పాటు కుల సంఘాల నాయకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement