
ధాన్యం..ధర దైన్యం
వరుస విపత్తులతో అప్పుల పాల వుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశలు పూర్తిగా సన్నగిల్లుతున్నాయి.
సాక్షి, ఏలూరు : వరుస విపత్తులతో అప్పుల పాల వుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశలు పూర్తిగా సన్నగిల్లుతున్నాయి. పంటల్ని నష్టపోయిన రైతులను అన్నివిధాలా అదుకుంటామంటూ చేస్తున్న ప్రకటనలు బూటకంగా కనిపిస్తున్నాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర క్విం టాల్‌కు కనీసం రూ.2 వేలకుపైగా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా రైతులు మొత్తుకుం టుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు ఇస్తున్నదే చాలా ఎక్కువని, వచ్చే మూడేళ్లలో ఇక పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల నిర్ణయాక కమిటీ చైర్మన్ అశోక్‌గులాటీ ఇటీవల ప్రకటించడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో వ్యవసాయం చేయాలా వద్దా అనే అలోచనలో పడేసింది.
పెరిగిన సాగు ఖర్చులు
జిల్లాలో దాదాపు 6లక్షల ఎకరాల్లో ఏటా రెండు పం టలు పండిస్తున్నారు. ఇందులో నాలుగున్నర లక్షలకు పైగా ఎకరాల్లో వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. అంటే జిల్లాలో 80 శాతం మంది ధాన్యం పండించే రైతులే ఉన్నారు. ఎకరాకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేయనిదే పంట చేతికి అందడంలేదు. తుపాన్లు వచ్చినా.. భారీ వర్షాలు కురిసినా పెట్టుబడి అంతా గంగపాలవుతోంది. గడచిన మూడు పంటల్లోనూ కలిపి 6 లక్షల ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న చేలల్లో కేవలం 7 నుంచి 15 బస్తాల దిగుబడే వస్తోంది. ధాన్యాన్ని అతి తక్కువ ధర చెల్లించి దళారులు దోచుకుంటున్నారు. మద్దతు ధరకే ధాన్యం కొంటామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ఏటా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగులుతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై అత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రకటించిన ధరైనా రాదాయె
ధాన్యంలో 17 శాతం తేమ ఉంటే ఏ గ్రేడ్‌గా పరిగణించి క్వింటాల్‌కు రూ.1,345, అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా భావించి క్వింటాల్‌కు రూ.1,310 చెల్లించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ ధర రైతుకు ఎప్పుడూ దక్కడం లేదు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకమైనా ఒకే ధర చెల్లిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో కనీస మద్దతు ధరకంటే తక్కువకు అడుగుతున్నారు. జిల్లా అధికారులు సమీక్షలు పెట్టి మిల్లర్లను హెచ్చరించినప్పుడల్లా కొద్దోగొప్పో రేటు పెంచుతున్నా అది తాత్కాలికంగానే ఉంటోంది.
నిజానికి సాగు ఖర్చులను బేరీజు వేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2,500 చెల్లించాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏటా రూ.50 లేదా రూ.60కి మించి పెంచడం లేదు. ఎప్పటికైనా గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రతినిధిగా అశోక్‌గులాటీ చేసిన వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేస్తున్నాయి. వచ్చే మూడేళ్లు పంటలు ఇలాగే ఉండి, నష్టాలు వస్తూ, గిట్టుబాటు ధర పెరగకపోతే వ్యవసాయం కష్టమంటున్నారు రైతులు.
ధర లేకపోతే అప్పులెలా తీరతారుు
‘మొన్నొచ్చిన తుపానుకి చేనంతా పడిపోయింది. కొద్దోగొప్పో మిగి లిన పంటను ఎలాగో ఒబ్బిడి చేసుకున్నాం. పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. ఎరువులు, పురు గు మందుల ధరలను బాగా పెంచేశారు. మొన్నటికి మొన్న మాసూళ్లు చేయిస్తున్నప్పుడు ఒక మడి బారు పనలను మోయడానికి రూ.1,500 తీసుకున్నారు. కేవలం పంట నూర్పిడికే ఎకరాకు రూ.4,000 అయిపోతున్నాయి. వచ్చిన నాలుగు గింజలకైనా గిట్టుబాటు ధర లేకపోతే అప్పులెలా తీరతాయి. మేమెలా బతకాలి.’
- దాసరి అచ్యురాజు, రైతు, బాదంపూడి