అధికారులే టార్గెట్‌ ..!

Vizianagaram District Parishad General Meeting - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ పాలనా లోపాలను పక్కన పెట్టి అధికారులే టార్గెట్‌గా శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సాగింది. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు మండి పడ్డారు. ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, డీపీఓ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యశాఖలకు సంబం ధించిన అంశాలపై చర్చ సాగింది.  జామిమండల కేంద్రం లో సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లిం చాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జామి జెడ్పీటీసీ సభ్యుడు పెదబాబు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈపై మండిపడ్డారు.

 గుర్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ గుర్ల మండలం గరికి వలస ఎస్సీ కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నీటిసరఫరా నిలిచిపోయిందని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సుజయ్‌ స్పందిస్తూ పథక నిర్మాణం పూర్తయ్యాకే తాగునీరు సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించారు. కురుపాంలో తాగునీటి పథకం  పాడవ్వడంతో 10 రోజులుగా అక్కడ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి తెలిపారు. సెప్టిక్‌ట్యాంక్‌ క్లీన్‌ చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని,

 దీనివల్ల మరుగుదొడ్డి నిర్మించడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎల్‌.కోట జెడ్పీటీసీ కరెడ్డ ఈశ్వరావు సభలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కలుగుజేసుకుని ఆర్‌డబ్ల్యూఎస్, రవాణశాఖ, సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్స్‌ తో సమావేశం నిర్వహించి సహజ ధర నిర్ణయిం చాలని జెసీ–2 నాగేశ్వరావుకు ఆదేశించారు. కొమరాడ జెడ్పీటీసీ పావని మాట్లాడుతూ ఉరిటి గ్రామానికి 293 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇందులో 150 వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వైడీఓ నెట్‌వర్స్‌ సంస్థ నిర్మాణాల పూర్తికి చొరవచూపడం లేదని తెలిపారు. 

డ్వామా పీడీపై మండిపడిన ఎమ్మెల్యే చిరంజీవులు..
 ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదని, దీనివల్ల వేతనదారులు ఇబ్బందిపడుతున్నారని డ్వామా పీడీ రాజ్‌గోపాల్‌ను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రంగారావు కలుగుజేసుకుని ఎప్పటి నుంచి ఉపాధిహామీ వేతనదారులకు డబ్బులు ఆగిపోయాయో చెప్పాలని అడిగారు. పిభ్రవరి 19 నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉందని, రూ.66 కోట్లు నిధులు పెండింలో ఉన్నాయని, త్వరలోనే «థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తామని రాజ్‌గోపాల్‌ బదులిచ్చారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు మాట్లాడుతూ  ఉపాధిహామీ పథకం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు, షిప్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు అమ్మేస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనిపై డ్వామా పీడీ కలుగుజేసుకుని నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న  అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు.

డెంకాడ జెడ్పీటీసీ అప్పలనారాయణ మాట్లాడుతూ మోపాడ పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు పోస్టులు –3, ఒక ల్యాబ్‌ టెక్సీషియన్‌ పోస్టును భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కురుపాం ఆస్పత్రికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు లేకపోవడం వల్ల రెండు, మూడు రోజులు మృత దేహాలను ఆస్పత్రుల్లో ఉంచేస్తున్నారని, చందాలు వేసుకుని మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని కురుపాం జెడ్పీటీసీ పద్మావతి అన్నారు. అలమండ ఎంపీటీసీకి నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌డీఎస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారని, ఆస్పత్రి మధ్యలో కళ్యాణ మండపానికి అతను రోడ్డు వేసేసాడని, హెచ్‌బిఎస్‌ చైర్మన్‌ నుంచి అతన్ని తొలిగిస్తారా లేదా ఆస్పత్రిని కూడ అతనికే ఇచేస్తారా అని జామి జెడ్పీటీసీ పెదబాబు డిఎంహెచ్‌వోపై మండి పడ్డారు. 

రుణాలు మంజూరు చేయడంలేదు.. 
టీడీపీ కార్యకర్తలకు పీఏసీఎస్‌లలో రుణాలు మంజూరు చేయడం లేదని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తినాయుడులు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభస్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాలగీత, కోళ్ల లలితకుమారి, నారాయణస్వామినాయుడు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top