గ్రామం తలెత్తుకొని..పేరు దాచుకొని!

Villagers And Students Insult With Village Name In Anantapur - Sakshi

‘కొజ్జేపల్లి’కి పరీక్ష!

పేరు మార్చాలని గతంలో తీర్మానం

అధికారుల నుంచి స్పందన కరువు

విద్యార్థులకు అవమానాలు

ఇతర గ్రామాల్లో పేరు చెప్పుకోలేక అవస్థలు

గాంధీనగర్‌గా మార్పు మాటల్లోనే..

అనంతపురం , గుత్తి రూరల్‌: మీ ఊరేది. ఈ ప్రశ్నకు ఎలాంటి వారైనా తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. దేశానికి రాజైనా.. ఓ ఊరుకు ముద్దుబిడ్డే. ఫలానా వ్యక్తి అనగానే.. ఆ ఊరు వ్యక్తిగా చెప్పుకోవడం చూస్తుంటాం. అయితే.. అక్కడి ప్రజలు మాత్రం తమ ఊరు పేరు చెప్పుకునేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు. సమాజంలో ఆ పేరు పట్ల ఉన్న చులకన భావనతోనే ఈ పరిస్థితి నెలకొంది. మండల కేంద్రం గుత్తికి 5 కి.మీ దూరంలోని కొజ్జేపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న కఠిన పరీక్ష పూర్వాపరాల్లోకి వెళితే.. వ్యాసరాయల కాలంలో కొందరు హిజ్రాలు గ్రామ శివారులో గుడిసెలు వేసుకుని నివసించారు.

అలా కాలక్రమంలో ఆ గ్రామం పేరు కొజ్జేపల్లిగా స్థిరపడినట్లు పెద్దలు చెబుతారు. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ప్రతి ఇంట్లో జత కాడెద్దులు ఉంటాయి. వర్షాధార పంటలతో పాటు కూరగాయలు, చీనీ, వేరుశనగ, పత్తి సాగు చేస్తారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 300 ఇందిరమ్మగృహాలు మంజూరు కావడంతో అందరూ గుడిసెలు వదిలి మిద్దెల్లో నివాసం ఉంటున్నారు. కొజ్జేపల్లిలోలోని 40 స్వయం సహాయక సంఘాల్లో 396 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గుత్తిలోని పలు జాతీయ బ్యాంకుల ద్వారా రూ.65.3లక్షల రుణం తీసుకున్నారు. 31 సంఘాల్లోని 172 మంది స్త్రీనిధి ద్వారా రూ.40.35లక్షల రుణం తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.

పాడిపరిశ్రమతో ఉపాధి  
గ్రామంలో 315 మంది రైతులు ఉండగా.. ప్రతి ఇంట్లో పాడి పశువుల కళ కనిపిస్తుంది. మహిళలు బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎనుములు కొనుగోలు చేసి పాల వ్యాపారం చేస్తున్నారు. ప్రతి రోజు గ్రామం నుంచి సుమారు 2.800 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక పశువుల నుంచి వచ్చే పేడ ద్వారా అదనపు ఆదాయం లభిస్తోంది.

గాంధీనగర్‌గా పేరు మార్చినా..
1980లో గ్రామంలో పర్యటించిన అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామయ్య కొజ్జేపల్లిని గాంధీనగర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్, డీపీఓలకు లేఖ రాసి పేరును మార్చేందుకు ప్రయత్నించారు. అయితే కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

ఊరు పేరు చెప్తే నవ్వుతున్నారు
ఎదన్నా పని మీద వేరే ఊర్లకు వెళ్లినప్పుడు మా ఊరు పేరు చెబితే నవ్వుతున్నారు. అదేం పేరు, మీ ఊర్లో అందరూ హిజ్రాలే ఉన్నారా అంటూ హేళన చేస్తున్నారు. అందుకే ఊరు పేరు చెప్పాలంటే తల కొట్టేసినట్లు ఉంటుంది. నా చిన్నప్పుడు కొందరు బొజ్జేపల్లిగా కూడా పిలిచేవారు.– యడవలి లక్ష్మన్న, కొజ్జేపల్లి

పేరు మార్చాలని తీర్మానం చేశాం
గ్రామం పేరు మార్చాలని నా భార్య నాగమణి సర్పంచ్‌గా ఉన్న రెండు పర్యాయాలు పంచాయతీ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. అయితే మేము అడిగిన విధంగా కాకుండా మూడు పేర్లు సూచిస్తాం, అందులో నుంచి ఎంపిక చేయాలని జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.– మల్లయ్యయాదవ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్, కొజ్జేపల్లి

సిగ్గుతో చచ్చిపోతున్నా
అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నా. కాలేజీలో ఊరు పేరు అడిగితే సిగ్గుతో చెప్పలేకపోతున్నా. ఎప్పుడో ప్రతిపాదించిన గాంధీనగర్‌ అని చెప్పుకుంటున్నా. అసలు పేరు తెలిస్తే ఎక్కడ గేలి చేస్తారోనని భయమేస్తుంది. పేరు మార్పు విషయంలో జిల్లా అధికారులు చొరవ చూపితే బాగుంటుంది.– టి.శిరీష, బీటెక్‌ విద్యార్థి, కొజ్జేపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top