తాత్కాలిక రాజధాని విజయవాడే!

తాత్కాలిక రాజధాని విజయవాడే!

  • దశలవారీగా సర్కారు కార్యాలయాల తరలింపునకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

  •   వచ్చే నెల తొలి వారం కల్లా కొన్ని ప్రభుత్వ శాఖల తరలింపు

  •   తొలుత శాఖల అధిపతులు, ఆ తర్వాత సిబ్బంది బెజవాడకు

  •   గన్నవరం వద్ద గల ‘మేధా టవర్స్’ను పరిశీలించాలన్న బాబు

  •   అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల పరిశీలనకూ సూచన 

  •   ఇప్పటికే రెండు శాఖలు విజయవాడ నుంచే పనిచేస్తున్న వైనం

  •   విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శాఖలకు

  •  అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ షురూ

  •   రాజధాని సలహా కమిటీతో ముఖ్యమంత్రి భేటీలో ఆదేశాలు

  •   ఇలా కార్యాలయాలను తరలిస్తే వసతి సౌకర్యాలు

  •  ఎలా అంటూ అధికారుల ఆందోళన

  •  

     సాక్షి, విజయవాడ/హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశల వారీగా విజయవాడకు తరలించాలని సూచించారు. రాష్ట్రానికి నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మరో వారం రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనున్న తరుణంలో.. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చంద్రబాబు మంగళవారం లేక్‌వ్యూ అతిథిగృహంలోని తన క్యాంపు కార్యాలయంలో.. రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి పి.నారాయణతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెకెన్సీ సంస్థ ప్రతినిధులు ‘విజన్ ఫర్ ఏపీ క్యాపిటల్’ పేరుతో దేశం, ప్రపంచంలోని వివిధ రాజధాని నగరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలని, అన్ని ప్రధాన శాఖల కార్యాలయాలు తాత్కాలిక రాజధాని నగరంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో సంబంధం ఉన్న శాఖల అధిపతుల కార్యాలయాలను తొలుత విజయవాడ తరలించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఆ తరువాత దశల వారీగా మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాలను తరలించాలని చెప్పారు. 

     

     ముందు నుంచీ ప్రచారం చేస్తున్నట్లుగానే... 

     రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడే కొత్త రాజధాని అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా అదే నగరాన్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలకు విజయవాడ చిరునామాగా రిజిస్ట్రేషన్లు చేపడుతుండగా, అదనపు డీజీ స్థాయి అధికారిని నగర పోలీస్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాలంటూ గత నెల రోజులుగా అంతర్గతంగా సాగుతున్న కసరత్తుకు అనుగుణంగా చంద్రబాబు సర్కారు అధికారికంగా నిర్ణయం తీసుకోవటంతో.. ప్రధాన శాఖలను తరలించే కసరత్తు ఊపందుకోనుంది. 

     

     ఇప్పటికే రెండు శాఖల తరలింపు...

     ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కీలక శాఖలు ఇప్పటికే విజయవాడ నుంచి పనిచేస్తున్నాయి. నీటి పారుదల శాఖ కార్యకలాపాల కోసం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర స్థాయి సమీక్షలు మొత్తం విజయవాడలోనే సాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ నుంచే తన శాఖ కార్యకలాపాల వేగం పెంచారు. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తన క్యాంపు కార్యాలయంతో పాటు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని పోరంకిలో దేవాదాయశాఖ నిర్మించిన వృద్ధాశ్రమం భవనాలను తన క్యాంపు కార్యాలయంగా, ఆ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలుగా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ఏర్పాట్లలో పడ్డారు. గృహ నిర్మాణ, అటవీ, పంచాయితీరాజ్, రహదారులు, భవనాల శాఖలను తొలుత తరలించే అవకాశం ఉంది. 

     

     మేథా టవర్స్‌లో ఏర్పాట్లపై నివేదిక... 

     సీఎం చంద్రబాబు విజయవాడ ఎప్పుడు వచ్చినా స్టేట్ గెస్ట్‌హౌస్‌లోనే బసచేస్తున్నారు. దీనిని తాత్కాలికంగా క్యాంపు కార్యాలయంగా వాడుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక గన్నవరం సమీపంలోని ‘మేథా టవర్స్’లో రాష్ట్ర స్థాయిలోని 11 శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ భవ నంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయడం కోసం కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నివేదిక కూడా కోరింది. ఇక్కడ రవాణా, ఐటీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, సహకార, ఆర్ అండ్ బీ, విద్య, వ్యవసాయ, ఎక్సైజ్, సంక్షేమ, వాణిజ్య పన్నుల శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, సిబ్బందిని ఇక్కడికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం విజయవాడ నగర సీపీ కార్యాలయాన్ని తాత్కాలిక డీజీపీ కార్యాలయంగా వాడుకోవచ్చని చెప్తున్నారు. అలాగే.. గన్నవరంలోని ప్రాంతీయ శిక్షణా కశాశాలలోని 25 ఎకరాల స్థలంలో ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. దీంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ఈ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కేటాయించేందుకు పరిశీలిస్తోంది. దీంతో పాటు విజయవాడకు సమీపంలో అద్దెకు తీసుకోవడానికి అనువైన భవనాలు ఏమున్నాయో వాటి వివరాలను కూడా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం నుంచి సేకరిస్తోంది. 

     

     వసతి సదుపాయాలు ఎక్కడ?

     రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలితే ఒక్కసారిగా వందలాది మంది అధికారులు, ఉద్యోగులు ఇక్కడికి తరలిరావాల్సి ఉంటుంది. ఈ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే జనాభా కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో  విజయవాడలో ఇంత మందికి వసతి దొరకడం కష్టమవుతుందని ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా అత్యవసరంగా విజయవాడకు తరలివెళ్లాలంటే ఎలా కుదురుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాఖల తరలింపు కోసం ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తే ముందుగా కొందరు అధికారులు, సిబ్బందిని మాత్రమే పంపాలని ఆయా విభాగాల ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

     

     అక్టోబర్ కల్లా కమిటీ ‘విదేశీ అధ్యయనం’ పూర్తి

     నూతన రాజధాని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా 16 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దాలని రాజధాని సలహా కమిటీతో భేటీలో సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర సామాజిక మౌలిక వసతులకు సమాన ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రభుత్వ, నివాస, వాణిజ్య, సాంస్కృతిక కార్యకలాపాలకు భూ పంపిణీ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఆగస్టు నెలాఖరులోగా నయా రాయపూర్, నవీ ముంబై, గాంధీనగర్, చండీగఢ్‌లను, అక్టోబర్ ఆఖరుకల్లా బ్రె సీలియా, సింగపూర్, పుత్రజయ (మలేసియా), దక్షిణాసియా, ఐరోపా, చైనా, జపాన్, కొరియా, మధ్య ప్రాచ్య దేశాలు, నగరాలను సందర్శించి అధ్యయనం పూర్తి చేస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా సీఎంకు  తెలిపారు. 

     

     మేధా టవర్స్‌ను పరిశీలించండి...

     ళీ విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఐటీ కంపెనీల స్థాపనకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీ నేతృత్వంలో 2006 లో మేథా టవర్స్ నిర్మించారు. ఇందులో రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉండగా.. అందులో 20 వేల చదరపు అడుగుల్లోనే ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. మిగిలిన 1.80 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. అందులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. విజయవాడలో వైశాల్యం ఎక్కువగా ఉండి అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా పరిశీలించాలని చెప్పారు. 

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top