‘రేపటితో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు’

Vijayasaireddy Fires on Chandrababu over Trips - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపి వేయించడానికి చంద్రబాబునాయుడు చేయని కుతంత్రం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడని తెలిపారు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని ట్విటర్‌లో చురకలంటించారు.

'23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్‌లాంటి పరికరాలే వీవీప్యాట్లు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుంది. వీవీప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోంది. సోనియాతోపాటు, ఉత్తరాది నేతలకూ సీన్ అర్థమైంది. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని మాయా, స్టాలిన్ అటు దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఫెవికాల్ బాబా మాత్రం ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి లేఖ ఇద్దాం అంటుంటే బాబు మానసిక స్థితిని వారు అనుమానిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top