
ఖర్చులు తగ్గించుకోమంటూ.. వేలకోట్లతో రాజధానా?:వడ్డే
ఒకవైపు ఖర్చులు తగ్గించుకోమని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. మరో వైపు వేల కోట్లతో రాజధానిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
విజయవాడ: ఒకవైపు ఖర్చులు తగ్గించుకోమని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. మరో వైపు వేల కోట్లతో రాజధానిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గురువారం ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పరిపాలనలో వికేంద్రీకరణ జరగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల స్థలం అవసరమా అని ప్రశ్నించారు. 15 ఎకరాలు సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి 20 ఎకరాలు, వివిధ కార్యాలయాలకు, ఉద్యోగుల క్వార్టర్లకు 120 ఎకరాలు సరిపోతాయని శివరామకృష్ణన్ కమిటీ చెబుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 20 వేల నుంచి 30 వేల ఎకరాలు అవసరమని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని చెప్పారు. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు.