కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం! | TTD Govindaraja Swamy Ornaments Stolen.. Key Evidence in CCTV cameras | Sakshi
Sakshi News home page

కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!

Feb 3 2019 12:17 PM | Updated on Feb 3 2019 4:50 PM

TTD Govindaraja Swamy Ornaments Stolen.. Key Evidence in CCTV cameras - Sakshi

సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగల పనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందే కిరీటాలు మాయం చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

సాయంత్రం 5.40 గంటల నుంచి 6 గంటల మధ్యప్రాంతంలో కిరీటాలు చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో ఆలయంలో అర్చకులు బాలాజీ దీక్షితులు, శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరా ఒకటి పని చేయడం లేదని గుర్తించారు. కిరీటాల మాయం కచ్చితంగా ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మరోసారి డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.

2011లోనూ..
టీటీడీ ఆలయాల్లో గతంలో కూడా పలుమార్లు నగలు మాయమయ్యాయి. 2011లో తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయంలోనూ నగల అపహారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడే నగలను తాకట్టు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సైతం గతంలో నగలు మాయమయ్యాయి. టీటీడీ ఆలయాల్లో వరుసగా జరగుతున్న నగల మాయంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే నగలు మాయమవుతున్నాయంటూ భక్తులు ఆరోపిస్తున్నారు.

ఆలయానికి చేరుకున్న పెద్ద జీయర్‌, చిన జీయర్‌..
కిరీటాల చోరీ నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి పెద్ద జీయర్‌, చిన జీయర్‌ చేరుకున్నారు. మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కావడంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామి వారి నగలకు భద్రత లేదంటూ దేవాలయం ముందు నిరసనకు దిగారు. కిరీటాల మాయంపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భద్రతను పటిష్టం చేయాలని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement