కుప్పం.. శాపం.! | Transfers to the lack of teachers | Sakshi
Sakshi News home page

కుప్పం.. శాపం.!

Sep 14 2015 2:03 AM | Updated on Sep 3 2017 9:20 AM

కుప్పం.. శాపం.!

కుప్పం.. శాపం.!

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం ఉపాధ్యాయులకు శాపంగా మారింది.

అక్కడి టీచర్లకు బదిలీలు ఉండవు
 విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు
 2013 బదిలీ ఉత్తర్వులు అమలు చేయని వైనం
 బదిలీ కోసం 434 మంది ఎదురు చూపు
 తాజా బదిలీలకు అడ్డంకి..
 అధికారుల తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం

 
చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం ఉపాధ్యాయులకు శాపంగా మారింది. కుప్పం నుంచి బదిలీపై వెళ్లేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ససేమిరా అంటుండడంతో బదిలీలు లేక వందలాది మంది ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. 2013 ఏడాదిలో బదిలీ ఉత్తర్వులు అందుకున్నా రిలీవర్స్ రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిలిచి పోయాయి. అయితే తాజా బదిలీలకు ఇది అడ్డంకిగా మారింది. 2013 బదిలీలను అమలు చేసిన తరువాతనే కొత్త బదిలీలు చేయాల్సి ఉంది. 2013లో జిలా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ విద్యాశాఖ  ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో సెకెండరీ గ్రేడ్ వారితో పాటు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే 204 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నా సబ్‌స్ట్యూట్‌లు రాకపోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదు.

కుప్పంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళితే తిరిగి వారి స్థానాలకు ఉపాధ్యాయులు వె ళ్లే పరిస్థితి లేదని తెలుసుకున్న ఉన్నతాధికారులు వారికి రిలీవ్ అయ్యే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బదిలీల తంతు సాగినా కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో అప్పట్లో బదిలీలను నిలిపివేశారు. మూడేళ్లు గడుస్తున్నా వారు రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కుప్పం అటు కర్నాటక,  ఇటు తమిళనాడు సరిహద్దులోనూ... చిత్తూరు, తిరుపతికి  దూరంగా ఉంది. దీంతో  వివిధ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం తిప్పలు తప్పడంలేదు. వసతుల లేమితో పాటు పిల్లల చదువుల ఇబ్బందుల దృష్ట్యా కుప్పంలో నివాసం ఉండేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడంలేదు. చాలా మంది  తిరుపతి,చిత్తూరులో  కాపురం ఉంటున్నారు.  కుప్పం ప్రాంతానికి  బదిలీపై వెళ్లేందుకు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించడంలేదు.

వెళ్లిన ఉద్యోగులు గడువు అనంతరం తిరిగి బదిలీ చేయించుకుని వచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా అనధికార ఉత్తర్వులతో ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులను సైతం భయపెడుతున్నారు.  ఒక్క కుప్పంలోనే 204 మంది ఉపాధ్యాయుల బదిలీలు ఆగాయి. కుప్పం నియోజకవర్గం అన్ని శాఖల అధికారులకు శాపంగా మారిందని ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల అధికారులు వాపోతున్నారు. తాజాగా ముందు మా సంగతి తేల్చమంటూ 434 మంది ఉపాధ్యాయులు అధికారులను నిలదీస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement