రాజీనా.. రాజీనామానా..?

tomarrow deside  Compromise or resignation on PDCCB Controversy

చైర్మన్‌ వర్సెస్‌ డైరెక్టర్లు

పతాకస్థాయికి పీడీసీసీబీ వివాదం

నేడు దామచర్ల వద్ద పంచాయితీ

చైర్మన్‌ను దించేందుకు మెజార్టీ డైరెక్టర్ల పట్టు

రేపు సాయంత్రానికి తేలనున్న పంచాయితీ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) రగడ పతాకస్థాయికి చేరింది. ప్రకాశం కేంద్ర సహకార బ్యాంకులో రూ.25 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, బోర్డు సభ్యులను వంచించి చైర్మన్, సీఈఓ కొందరు అక్రమాలకు పాల్పడ్డారని 14 మంది పీడీసీసీబీ డైరెక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సహకార శాఖ మంత్రి, కమీషనర్, జిల్లా ఎస్పీతో పాటు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. చైర్మన్‌ ఈదరను పదవీచుతుడ్ని చేయాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టారు. ఆయనపై బహిరంగ విమర్శలకు దిగారు. అధికార టీడీపీ మద్ధతుదారుగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌ను దింపేందుకు సొంత పార్టీకి చెందిన మెజార్టీ డైరెక్టర్లు పట్టుపట్టడం ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు సత్సంబంధాల్లేవు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. డీసీసీబీ వ్యవహారాన్ని బుధవారం రాత్రి ఎమ్మెల్యే జనార్దన్‌తో పాటు మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పంచాయితీ తెంచాలని

సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్‌ శుక్రవారం డీసీసీబీ వివాదంపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌ ఈదర మోహన్‌ ఎట్టి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని గతంలో వైస్‌ చైర్మన్‌గా ఉన్న మస్తానయ్యతో పాటు 15 మంది డైరెక్టర్లు పట్టుపడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన చైర్మన్‌గా ఈదరను అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం దామచర్ల వద్ద జరిగే పంచాయితీలోనూ ఇదే చెబుతామని పలువురు డైరెక్టర్లు సాక్షితో చెప్పారు. ఈదర మోహన్‌ అధికార పార్టీ మద్ధతుదారుడిగానే కొనసాగుతున్నందున డైరెక్టర్లను ఒప్పించి చైర్మన్‌గా ఈదరను కొనసాగించేలా రాజీ ప్రయత్నాలు జరుగుతాయన్న ప్రచారమూ ఉంది.

ఈదరకు పదవి గండం..?
డైరెక్టర్లలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అనుచరులున్నారు. అయితే 20 మంది డైరెక్టర్లలో దాదాపు 17 మంది డైరెక్టర్లు  ఈదరను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన్ను పదవి నుంచి దించేందుకు పట్టుపడుతున్నారు. టీడీపీ అధిష్టానం ఈదరనే చైర్మన్‌గా కొనసాగించే పక్షంలో ఎమ్మెల్యేల ద్వారా డైరెక్టర్లపై ఒత్తిడి పెంచి సమస్యను సర్దుమణిగేలా చేసే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తే  పదవి నుంచి తప్పుకోవాలని సూచించే అవకాశం ఉంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఈదర మోహన్‌కు విభేదాలున్న నేపథ్యంలో చివరకు ఏం జరుగుతున్నది ప్రశ్నార్థకంగా మారింది. డైరెక్టర్ల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చే పక్షంలో ఈదర పదవి నుంచి తప్పుకోవడం మినహా గత్యంతరం లేదు. అదే జరిగితే శుక్రవారం సాయంత్రానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top