నేడు చంద్రబాబు నిరాహార దీక్ష

Today Chandrababu hunger strike - Sakshi

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు..

ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిరశన

కేంద్రంపై శాంతియుత పోరాటం... 

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలనే డిమాండ్‌తో శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో 12 గంటల నిరాహార దీక్ష చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన దీక్ష చేయనున్నారు. దీక్షకు భారీయెత్తున ప్రజలను తరలించేందుకు అధికారులు, టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలావుండగా.. పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలతో పాటు చట్టబద్ధమైన డిమాండ్లు నెరవేర్చే వరకు కేంద్రంపై శాంతియుతంగా పోరాడతామని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి అందరూ బాసటగా నిలవాలంటూ రాష్ట్ర ప్రజలకు గురువారం ఆయన రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన సమయమిదని, ఇందులో భాగంగానే తాను 12 గంటల పాటు నిరశన వ్రతాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులు చూస్తే విభజన హామీలు మరో 20 ఏళ్లు గడిచినా పూర్తవుతాయన్న నమ్మకం కలగడం లేదన్నారు. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా ఇవ్వలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సాయం నామమాత్రమేనని లేఖలో పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున చేస్తున్న ఈ పోరాటానికి అంతా బాసటగా నిలిచి తనతో కలిసి నడవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top