
గరగపర్రు ఘటనలో ముగ్గురి అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు కారణమైన బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
అంబేడ్కర్ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూముల్ని దళితుల వద్ద నుంచి వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం మానేసిన విషయం తెలిసిందే. కాగా దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగప ర్రులో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 30, జులై 1వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు.
మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇవాళ గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమని, వారికి న్యాయం జరిగేవరకు వారి వెన్నంటే ఉంటామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల భూమి కేటాయించాలని ముద్రగడ డిమాండ్ చేశారు.