కాపు కల్యాణ మంటపం స్థలం కబ్జా

Thota Trimurthulu Neglects The Kaapu Community - Sakshi

 సాక్షి, రామచంద్రపురం: నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సొంత సామాజిక వర్గం కాపుల ఓట్లతోపదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. కాపు కల్యాణ మంటపం కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఆయన బంధువులకు కట్టబెట్టారని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దామిశెట్టి గంగాపురుషోత్తం ఆరోపించారు. పట్టణంలోని వినయ్‌దుర్గ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ కాపు సామాజికవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇష్టదైవం ప్రసన్నాంజనేయస్వామి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. కాపులను కేవలం ఓట్ల కోసమే తప్ప కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏనాడు పాటు పడలేదన్నారు. అమలాపురంలో పశువుల వ్యాపారం చేసుకునే ఆయన 1994లో నియోజకవర్గానికి వచ్చారన్నారు.

కల్యాణ మంటపం కట్టుకోవాలంటూ కాపులను ఏకం చేసిన ఆయన.. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇండిపెండెంట్‌గా కాపుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తొలిసారి ఇండిపెండెంట్‌గా ఆయన గెలిచిన సమయంలో తాను తోట వద్దే ఉన్నానని, ఆ సమయంలో ద్రాక్షారామలో కాపులకు కల్యాణ మంటపం నిర్మించేందుకు దేవస్థానం భూమిని తీసుకున్నట్టు ఆయన వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాపులకు మాత్రం కల్యాణ మంటపాన్ని మాత్రం నిర్మించలేదని విమర్శించారు. అప్పట్లో సేకరించిన ఆ భూమి ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం రూ.70కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ విషయంలో కాపులను ఆయన నిలువునా మోసం చేశారని విమర్శించారు.

తిరిగి కాపులను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో కాపులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తుంటే అప్పుడేందుకు మాట్లాడలేదని గంగాపురుషోత్తం ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల ఓట్లు ఆయనకు కావాల్సి వచ్చాయన్నారు. ఇప్పటికైనా కాపులు మోసపోకుండా ఉండాలని ఆయన కోరారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలన్నారు. కాపు నాయకులు తొగరు మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సంఘీయులు హాజరయ్యారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top