ఆలయంలో చోరీకి వచ్చి హుండీని ఎత్తుకుపోయిన దొంగలు ఆ తర్వాత.. దేవత ఆగ్రహించి తమను ఏమైనా చేస్తుందని భయపడి ఎత్తుకుపోయిన హుండీని తిరిగి తెచ్చి యథాస్థానంలో ఉంచారు.
గార్లదిన్నె : ఆలయంలో చోరీకి వచ్చి హుండీని ఎత్తుకుపోయిన దొంగలు ఆ తర్వాత.. దేవత ఆగ్రహించి తమను ఏమైనా చేస్తుందని భయపడి ఎత్తుకుపోయిన హుండీని తిరిగి తెచ్చి యథాస్థానంలో ఉంచారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కమలాపురం గ్రామ సమీపంలో అక్కమ్మ దేవత గుడి ఉంది. అయితే వారం క్రితం గుడి మంటపంలో దొంగలు ప్రవేశించి అక్కడున్న హుండీని ఎత్తుకుపోయారు. దీనిపై పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రీరామనవమి సందర్భంగా శనివారం పూజలు చేయటానికి వెళ్లిన ఆలయపూజారి ఆలయ హుండీ యథాస్థానంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దీని గురించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో వారు ఆలయానికి చేరుకుని హుండీని తెరిచి చూడగా అందులో రూ.6వేల నగదు భద్రంగా ఉంది. అక్కమ్మ దేవతకు భయపడిన దుండగులు హుండీని తిరిగి యథాస్థానానికి చేర్చి ఉంటారని గ్రామస్తులు తెలిపారు.