ఆధ్యాత్మిక కళా స్రవంతి


ఆధ్యాత్మిక, కళా రంగాల్లో  ఈ ఏడాది జిల్లా ఖ్యాతి రెపరెపలాడింది. ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహభాషణలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. కళారంగంలో సృజనాత్మకత వెల్లివిరిసింది. సేవాభావం మిన్నంటింది. ఆహ్వాన నాటిక ప్రదర్శనలు, రంగస్థల కళాకారుల నెలవారీ సాంస్కృతిక పరిమళాలు, పౌరాణిక, సాంఘిక ప్రదర్శనలు కట్టిపడేశాయి


 


 శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లాకు తీపి జ్ఞాపకాలను మిగిల్చిం దని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక, కళా రంగాల్లో జిల్లాకు సముచిత స్థానం లభించింది. నెల రోజుల పాటు జరిగిన షోడశ గణేశయాత్ర ఆధ్యాత్మికతను వికసింపజేసింది. త్రిదండి అహోబిల రామానంద జీయర్ స్వామి, శ్రీదత్తవిజయానంద తీర్ధ పర్యటనలు, మహా సౌరయాగం,  కుంచాలకూర్మయ్యపేటలో 1001 శ్రీ చక్రమేరువుల ప్రతిష్ట..జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. అయితే..జిల్లా గొప్ప సాహితీ వేత్త ఛాయారాజ్‌ను కోల్పోయింది. 


 


 కళారంగంలో నూతన ఆవిష్కరణలు


 ఈ ఏడాది కళారంగంలో నూతన ఆవిష్కరణలకు చోటు లభించింది.  ఏప్రిల్ 27,28 తేదీల్లో శ్రీసృజనా కళాకారుల సేవా సంఘం  ఆధ్వర్యంలో  రెండు రోజుల పాటు  స్మారక ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించారు.  ఉత్తమ ప్రదర్శనగా కాకినాడ మూర్తి కల్చరల్ వారు ప్రదర్శంచిన ‘సంచలనం’ నాటికకు లభిం చింది. ఉత్తమ నటిగా ‘వారధి’లో నటించిన పట్టణానికి చెందిన కె.రాజేశ్వరి అందుకున్నారు.


 


  అక్టోబర్‌లో శ్రీసృజన కళాకారుల సేవా సంఘం ఆధ్వర్యంలో రావి కొండలరావు రచించి, దర్శకత్వం వహించిన  ఉరితాడు, వైకుంఠపాళి నాటికలు ఆకట్టుకున్నాయి. రావికొండలరావుతో పాటు నటుడు కోట శంకరరావును సంస్థ సభ్యులు సత్కరించారు. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. 


   సమైక్యాంధ్రపై వాసుదేవాచారి గజల్ పాడి రికార్డు చేసిన సీడీని  రంగస్థల కళాకారుల నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో ఆవిష్కరించారు. నిషా పట్నాయక్ శాస్త్రీయ నృత్యం, వంశీకృష్ణ ఆధునిక నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.


   భువనేశ్వర్(ఒడిశా)లో ఏప్రిల్‌లో జరిగిన ‘నయఘర్’ జాతీయ నృత్యోత్సవంలో  రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం (15) మందితో ప్రదర్శన ఇచ్చి చిక్కోలు ఖ్యాతిని చాటారు. 


 


  కళాసేవకుగాను అభినయ నృత్యనికేతన్ నృత్య దర్శకురాలు తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యంకు ‘ఆంధ్రా స్రవంతి’  పురస్కారాన్ని  చెన్నైకి చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ ప్రధానం చేసింది. 


  మార్చి 3న సునాదవినోదిని భారతీ గానసభ 26వ వార్షికోత్సవ సంగీత సభలలో భాగంగా సద్గురు శ్రీత్యాగరాజ  ఉత్సవాలు జరిగాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యసాయి మందిరంలో  ఉగాది సందర్భంగా వెయ్యి  తెలుగు పద్యాల సదస్సు జరిగింది. 


 


 మహావీర్ జయంతి ఉత్సవాలు ఇక్కడి మార్వాడీల ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించేందుకు రాజస్థాన్‌నుంచి  జైన మత సాధిశ్రీ డాక్టర్ కుందన రేఖ వచ్చా రు. ర్యాలీ, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరిగాయి.


   జూన్ 19న  కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో సామాజిక భాద్యతగా ‘నేను నాఊరు’ అనే కార్యక్రమం గ్రామీణ రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  రివర్‌వ్యూ పార్కులో చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెలా మొదటి, మూడో ఆదివారాలలో చిన్నారులకు పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తు వారిలో ఉన్న మెలకువలకు పదును పెడుతున్నారు.  


 


  ప్రముఖ కవి ఛాయారాజ్ మృతి 


 పీడిత ప్రజల తరఫున  కలంతో నిరంత పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ ఛాయారాజ్ మృతి జిల్లాకు తీరని లోటుగా మిగిలింది. ఉత్తరాంధ్ర ప్రజలను కదిలించి, అభినవ శ్రీశ్రీగా పేరుపొందిన ఆయన శ్రీకాకుళ ఉద్యమ కావ్యం, కారుకారి(నవల), ఛాయారాజ్-1(దీర్ఘకావ్యాలు), గుమ్మ, నిరీక్షణ, బెస్తని, దర్శని, మట్టి ఉన్నంత కాలం  ఉండనీయి( కవితా సంపుటి), బుదడు,తోలెరుక, దుక్కేరు, రస స్పర్శ వంటి రచనలతో ఎనలేని ఖ్యాతి పొందారు. 


 


 లఘుచిత్రాల 


 ఉత్సవం హైలెట్


 


 


  ఫిబ్రవరి 3,4  తేదీల్లో  ఉత్తరాంధ్ర స్థాయి షార్ట్ ఫిల్మ్  ఉత్సవాలు తొలిసారిగా జరిగాయి. మూడు జిల్లాల నుంచి 35 చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శన నిర్వహించారు. ఎక్కువగా ఇంజినీరింగ్ విద్యార్థులు లఘుచిత్రాలు ఉత్సాహంగా తీశారు. 


 


   వైభవం..


 శ్రీ చక్రమేరువుల ప్రతిష్టోత్సవం


 ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట దేవీ ఆశ్రమంలో ప్రతిష్టించిన 1001 శ్రీ చక్రమేరువులు జిల్లాలో భక్తి భావాన్ని మరింత పెంపొందించాయి. అమ్మవారి రూపాలను ఆవిష్కరించడం విశ్వవిఖ్యాతమైంది. 


 


  ఫిబ్రవరి 9న  సత్యసాయి జీవిత చరిత్ర చిత్రీకరణ


 పట్టణంలోని పలు సత్యసాయి సేవా కేంద్రాల్లో  యూఎస్‌ఏకు చెందిన హాలీవుడ్ దర్శకుడు గానె మాసి, ముంబాయి హిందీ సినీ నిర్మాత నరేష్ శర్మ కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ నారాయణ సేవ కార్యక్రమం, రిమ్స్‌లో నిర్వహిస్తున్న అన్నపూర్ణ నిత్య అన్నదాన పథకంపై కొన్ని షాట్లు తీశారు.  మే 5న ప్రొఫెసర్ అనీల్‌కుమార్ ప్రేమ-ఆచరణ అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. 


 


 సామాజిక సేవలో..


  జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు వైద్య సదుపాయం అందించేందుకు సంచార వైద్య శాలకు జీఎంఆర్ రూ.18లక్షల రూపాయల విలువగల వ్యాన్‌ను  అందించారు. 


  వైష్ణవి ఇంజినీరింగ్ కళాశాలలో మూడో ఏడాది(మెకానికల్ విభాగం)  చదువుతున్న ముగ్గురు విద్యార్థులు..స్నేహితులతో కలిసి రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. 


 


   సమైక్యాంధ్ర ఉద్యమంలో


  కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు


 ఈ ఏడాది ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు.  రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డీసీసీబీ  కాలనీకి చెందిన సుందర సత్సంగం సభ్యులు నడి రోడ్డుపై రుద్రాభిషేకాలు, ర్యాలీలు, టార్చిలైట్ల ప్రదర్శనలు చేశారు. సెప్టెంబరు 30న జేసీఐ ఫెమీనా..ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర వంటల పోటీలు, ముగ్గుల పోటీలు  ఆసక్తిగా సాగాయి. 


 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top