గాలికొదిలేశారు | The residence of the local officials have been convicted | Sakshi
Sakshi News home page

గాలికొదిలేశారు

Feb 21 2014 3:53 AM | Updated on Sep 2 2017 3:55 AM

వార్డెన్లు స్థానికంగా నివాసం ఉంటూ విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా జిల్లాలో పరిస్థితి మారడం లేదు.

గోదావరిఖనిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని ఒకరు పాపకు జన్మనిచ్చిన సంఘటన వెలుగులోకి రాకుండా హాస్టల్ సిబ్బంది, అధికారులు నానాతంటాలు పడుతున్నారు. విచారణ పూర్తి చేసినా, ఏమీ జరగనట్లు గుంభనంగా ఉండిపోయారు. ఈ సంఘటనకు బాధ్యుడు ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతోనే బయటకు పొక్కనీయడం లేదని సంక్షేమ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.
 
 వారం రోజుల క్రితం కరీంనగర్‌లోని గిరిజన బాలికల వసతిగృహంలో పనిచేసే వర్కర్ గంగూబాయి కుమారుడు రఘు ఇద్దరు విద్యార్థినులను తీసుకొని అదృశ్యమయ్యాడు. తిరిగివచ్చి అందులో ఒక విద్యార్థినిని తీసుకొని మరోసారి పారిపోయాడు.
 
 బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమ అధికారులు వార్డెన్లతో కుమ్మక్కై వారి తప్పులను కప్పిపెడుతున్నారు. ఫలితంగా సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల భద్రత గాలిలో దీపంగా మారింది.
 - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ                 
 
 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : వార్డెన్లు స్థానికంగా నివాసం ఉంటూ విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా జిల్లాలో పరిస్థితి మారడం లేదు. జిల్లాలోని చాలామంది వార్డెన్లు పట్టణాల్లో నివాసం ఉంటూ చుట్టపు చూపుగా హాస్టళ్లకు వచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. కొంతమంది వారాల తరబడి హాస్టల్ మొహం చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తికాదు. శంకరపట్నంలోని ఓ హాస్టల్ వార్డెన్ కరీంనగర్‌లోనే ఉంటూ, హాస్టల్ బాధ్యతను స్థానిక వర్కర్‌కు అప్పగించడం.. వార్డెన్ల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. స్థానికంగా ఉండకున్నా.. వర్కర్లపై ఆధారపడి విధులు నిర్వర్తిస్తున్నా.. వార్డెన్లపై చర్యలు లేకపోవడానికి కారణం ఊహించడం కష్టం కాదు.
 కాగితాల్లోనే పర్యవేక్షణ
 జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమశాఖ అధికారులు వార్డెన్లతో కుమ్మక్కు కావడంతో కాగితాలపైనే పర్యవేక్షణ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలలో కనీసం 20 రోజులపాటు సహాయ సంక్షేమశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో హాస్టళ్లకు వెళ్లి పర్యవేక్షించాలి. జిల్లా అధికారులు కూడా హాస్టళ్లను తనిఖీ చేయాలి. కానీ, ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. వార్డెన్లను తమవద్దకే పిలిపించుకుని ప్రతి నెలా కార్యాలయాల్లోనే ‘పర్యవేక్షణ’ చేస్తున్నారు. జిల్లా అధికారులైతే ఏదైనా సంఘటన జరిగితే తప్ప క్షేత్రస్థాయి అనే విషయమే మరిచిపోయారు.
 
 కంచే చేను మేస్తోంది..
 హాస్టల్ విద్యార్థినులను కాపాడాల్సినవారే లైంగికదాడులకు దిగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో వరుసగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు పరిశీలిస్తే, హాస్టల్ సిబ్బంది, వార్డెన్లు, వారి బంధువులు, సన్నిహితులే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాలికలపై లైంగికదాడులకు పాల్పడడం, బయటకు పొక్కనీయకుండా బాధితులను, విద్యార్థినులను బెదిరించడం, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడం మామూలైపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొనకపోతే విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 మరికొన్ని సంఘటనలు
 కొన్ని నెలల క్రితం జమ్మికుంట సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వర్కర్ చాంద్‌పాషా ఓ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరం తెలిసినా, కప్పిపుచ్చేందుకు సంబంధిత అధికారులు బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో వార్డెన్, సహాయ అధికారి, అధ్యాపకులతోపాటు లైంగికదాడికి పాల్పడిన వర్కర్‌ను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశారు.
 
 అంతకుముందు రామడుగులోని బీసీ బాలికల వసతిగృహం పరిసరాల్లో పోకిరీలు విద్యార్థినులను నిత్యం వేధింపులకు గురిచేశారు. వార్డెన్ పట్టించుకోకపోవడంతో పోకిరీల బెడద నుంచి రక్షించాలంటూ విద్యార్థినులు రాస్తారోకో చేపట్టడంతో అధికారులు మేల్కొన్నారు.
 జూలపల్లి బీసీ బాలికల వసతిగృహంలో సంబంధిత వార్డెన్ సమీప బంధువొకరు విద్యార్థినులపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను బయటకు పొక్కకుండా చూసినప్పటికీ... ఆ నోటా ఈ నోటా వెలుగుచూడడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.          
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement