జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు వెంటనే రూ.15 కోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
చిత్తూరు(టౌన్): జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు వెంటనే రూ.15 కోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో చేపట్టిన తాగునీటి రవాణా బకాయిల చెల్లింపుల కోసం రూ. 8 కోట్లు, బోరు మోటార్లు, పైపులైన్ల కోసం అదనంగా రూ. 7 కోట్లు కావాల ని ఆ ప్రతిపాదనల్లో కోరారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా చేయాలన్నా నీల్లున్న బోర్లు దగ్గరగా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కొత్తబోర్ల తవ్వకాలను చేపట్టాల్సివచ్చింది. అయితే గత ఏడాది 500 నుంచి 750 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే లభ్యమయిన నీరు ఈ ఏడాది వెయ్య అడుగుల లోతుకు వెళ్లినా కొన్ని ప్రాంతాల్లో నీరు లభ్యం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో లభ్యమైనా గతంలో ఉపయోగించిన బోరు మోటార్లు శక్తి చాల నందున వాటికి కొత్తగా అదనపు పవరుతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాని కోసం ప్రభుత్వం నిధులిస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితిలో జిల్లా యంత్రాంగం లేదు.
1,710 గ్రామాల్లో సమస్య
జిల్లాలో వేసవిలో లేనంతగా ప్రస్తుతం తాగునీటి ఎద్దడి నెలకొంది. వేసవిలో 1,220 గ్రామాల్లో సమస్య ఉండగా, ప్రస్తుతం అది 1,710 గ్రామాలకు చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు 1,468 గ్రామాల్లో ట్యాంకర్లతో రవాణా చేస్తుండగా 242 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఐరాల మండలంలో 111, పూతలపట్టులో 105, తవణంపల్లెలో 82,యాదమరిలో 75, బంగారుపాళెంలో 71, మదనపల్లెలో 78, రామసముద్రంలో 58, నిమ్మనపల్లెలో 46, పెనుమూరులో 51, కుప్పంలో 62, వాల్మీకిపురంలో 27, తంబళ్లపల్లెలో 23, పాకాల మండలంలో 48 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇవి కాకుండా జిల్లాలోని పలు మండలాల్లో తాగునీటి ఎద్దడి ఉంది.