న్యాయ నిర్ణయంలో అన్యాయం | The determination of the law is unfair | Sakshi
Sakshi News home page

న్యాయ నిర్ణయంలో అన్యాయం

May 31 2015 2:15 AM | Updated on Sep 3 2017 2:57 AM

రాజమండ్రి/ రాజమండ్రి కల్చరల్ : నంది నాటకోత్సవాల అనంతరం కొన్ని సమాజాల కళాకారులు న్యాయనిర్ణేతలపై రౌద్రరసాన్ని ప్రదర్శించారు.

రాజమండ్రి/ రాజమండ్రి కల్చరల్ : నంది నాటకోత్సవాల అనంతరం కొన్ని సమాజాల కళాకారులు న్యాయనిర్ణేతలపై రౌద్రరసాన్ని ప్రదర్శించారు.  పక్షపాత ధోరణితో తమ ప్రదర్శనలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆనం కళాకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కళాకేంద్రంలో గత 15 రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాల బహుమతులను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చివరిరోజైన శనివారం ప్రకటించారు. అయితే కొన్ని నాటకాలకు అసలు బహుమతులే రాకపోవడం, ఒక్కో నాటకానికి మూడేసి బహుమతులు రావడాన్ని కొన్ని సమాజాల వారు నిరసించారు. న్యాయ నిర్ణయంలోప్రాంతీయ వివక్ష చూపారని ఆరోపించారు. ‘కొమరం భీం, పడగనీడ, ఖుర్బాని, వికసించిన మందారాలు’ ప్రదర్శనలపై పక్షపాత ం చూపారని, తమకు న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. ‘కొమరం భీం’కు గతంలో మంచి అవార్డులొచ్చాయని, ఈసారి ఏమీ తెలియనివారిని న్యాయనిర్ణేతలుగా నియమించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
 
 ‘పడగ నీడ’ సాంఘిక నాటికకు అసలు బహుమతులే రాకపోవడం దారుణమని ఆ  కళాకారులు ఆవేదన చెందారు. తెలంగాణ కు చెందిన సమాజం ప్రదర్శన కావడంతోనే ‘కొమరం భీం’పై పక్షపాతం చూపారని కొందరు ఆరోపించారు. ‘ఖుర్బాని’ సాంఘిక నాటకం అందరి ప్రశంసలు పొందిందని, దేశభక్తిని చాటి చెప్పిన ఆ నాటకానికి తృతీయ బహుమతి ప్రకటించడం సమంజసం కాదన్నారు. ప్రేక్షకులను ఇందులో భాగస్వాముల్ని చేసి ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కళాకేంద్రం వద్ద ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిన పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారుు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న బహుమతీ ప్రదానోత్సవ సభావేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హాలు బయట గేటువద్దే కూర్చుని ఆందోళన కొనసాగించారు. కాగా తమకు ఏ విభాగంలోనూ కనీసం ఒక్క బహుమతి కూడా రాలేదని ‘వికసించిన మందారాలు’ కళాకారులు ఆవేదన చెందారు.
 
 ఒకే సమాజానికి, ఒకే ప్రదర్శనకు రెండేళ్లూ నందులా?
 ఒకే సంస్థ, ఒకే దర్శకుడి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రెండు బాలల సాంఘిక నాటికలను వరుసగా 2013, 2014 సంవత్సరాలకు బంగారు నందులకు ఎంపిక చేయడాన్ని కొందరు తప్పుపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో బాల కళాకారులు ఉత్సాహభరితంగా బాలల సాంఘిక నాటికలలో పాల్గొన్నారు. అరుుతే  వైఎస్సార్ జిల్లా, రాజంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రదర్శించిన ‘మేము సైతం’ 2013 సంవత్సరానికి, అదే సమాజం ప్రదర్శించిన ‘మనో వైకల్యం’ 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల సాంఘిక నాటికలుగా ఎంపికయ్యాయి. రెండింటికీ కె.వి.రంగారావు దర్శకుడు. ఒకే సంస్థకు ఇలా గుత్తగా ఇవ్వడం కాక ఇతర సంస్థలను కూడా ప్రోత్సహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement