అప్పు కడతారా.. వేలం వేయాలా! | Sakshi
Sakshi News home page

అప్పు కడతారా.. వేలం వేయాలా!

Published Sat, Jun 21 2014 1:49 AM

the bank officials gave overdue notices to farmers

కోవెలకుంట్ల: పప్పుశనగ రైతు కష్టాల్లో కూరుకుపోయాడు. రెండేళ్ల పాటు మురిపించిన ధర.. ఒక్కసారిగా నేలను తాకడం వారిని గందరగోళంలోకి నెట్టింది. వరుణుడు ఊరిస్తున్న తరుణంలో ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యేందుకు పెట్టుబడి కోసం ఈ రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీపై మీనమేషాలు లెక్కిస్తుండటంతో బ్యాంకర్లు కొత్త రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వీరికి శాపంగా మారుతోంది. చివరకు బ్యాంకర్లు రుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన శనత బస్తాలను వేలం వేస్తామని నోటీసులు జారీ చేయడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
 
కర్నూలు జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో(సుమారు 1.50 లక్షల ఎకరాల్లో) కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో ఏటా పప్పుశనగ పంట సాగవుతోంది. రెండేళ్లుగా గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు పండించిన శనగ బస్తాలు గోదాముల్లో మగ్గుతున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కోవెలకుంట్ల డివిజన్‌లో అధిక సంఖ్యలో గోదాములు ఉన్నాయి. డివిజన్‌లో లక్ష నుంచి 5 లక్షల బస్తాల సామర్థ్యం కలిగిన 30 గోదాములు నిర్మించారు. రెండు సంవత్సరాలుగా వాతావరణం అనుకూలించడంతో శనగలో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది.
 
ఎకరాకు సగటున 6 నుంచి 8 బస్తాల దిగుబడి సాధించారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో గత ఏడాది ఆయా గ్రామాల్లోని గోదాముల్లో బస్తాలను నిల్వ చేశారు. వీటిపై బాండ్లను పొంది రైతులు వివిధ ప్రాంతాల్లోని స్టేట్‌బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఒక్కో గోదాములో సుమారు 200 మంది రైతులు ఒక్కొక్కరు 100 నుంచి 120 బస్తాలపై బాండ్లను పొంది బస్తాపై రూ.1800 నుంచి రూ.2వేల వరకు రుణం తీసుకున్నారు.
 
డివిజన్‌లో సుమారు 6 వేల మంది రైతులు రూ.100 కోట్ల వరకు రుణాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. రుణం పొంది ఏడాది కావడంతో తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో శనగ బస్తా ధర రూ.2850 పలుకుతోంది. ఈ ధరకు విక్రయిస్తే రైతులు బ్యాంకులో తీసుకున్న రుణం, గోదాముల బాడుగకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. శనగ బస్తాలపై తీసుకున్న రుణానికి గడువు దాటిపోవడంతో బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది.
 
రుణం చెల్లించాలని లాయర్ నోటీసులు
కోవెలకుంట్ల ఆంధ్రా బ్యాంకులో ఏడాది క్రితం వంద శనగ బస్తాలకు సంబంధించి బాండ్లపై రూ.2 లక్షల రుణం తీసుకున్నా. ఇప్పటికి రూ.25 వేలు వడ్డీ అయింది. తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి లాయర్ నోటీసు పంపినారు. వడ్డీ చెల్లిస్తానన్నా వినిపించుకోవడం లేదు. రుణం చెల్లించే రోజు అదనంగా రూ.250 నోటీసు ఇచ్చినందుకు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. మార్కెట్‌లో శనగకు గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుత ఖరీఫ్ పెట్టుబడులకు రుణం దొరకడం లేదు. రుణం చెల్లించకుంటే శనగ బస్తాలను వేలం వేస్తామని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు.
- రామసుబ్బారెడ్డి, కిష్టిపాడు, దొర్నిపాడు మండలం

Advertisement
Advertisement