ఆలికి పరీక్ష .. ఆపై హతం

The Test And Then The Killing - Sakshi

వారిద్దరూ ఒకేచోట కలిసి పెరిగారు.. ఆడిపాడుతున్న క్రమంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు సంతానం కూడా పుట్టారు. ఈ నేపథ్యంలో భర్త అసలు రంగు బయటపడింది. ప్రేమ బాసలు.. పెళ్లి ప్రమాణాలు మరిచాడు. అదనపు కట్నం వేధింపులతోపాటు వదిలించుకునేందుకు పన్నాగం పన్నాడు. ఈ కుట్ర తెలియని అమాయక ఇల్లాలకు కాపురం పరీక్ష పెట్టాడు. నేను నీతో మాట్లాడుతున్నట్లు ఊరిలో ఎవరికీ తెలియకూడదని షరతు విధించాడు. ఇందులో నువ్వు నెగ్గితేనే జీవితమని, లేకుంటే తీసుకెళ్లనని తేల్చిచెప్పాడు. ఈ చివరి పరీక్షలోనే గొంతు నులిమి, తలను నేలకి బాది మరీ దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మండలంలోని పల్లివూరు పంచాయతీ హకుంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

సాక్షి, వజ్రపుకొత్తూరు: గ్రామానికి చెందిన మైలపల్లి పుష్పలత(24) భర్త శంకర్‌ చేతిలో హత్యకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని హుకుంపేటకు చెందిన గుంటు ఎర్రన్న రాజులమ్మ పెద్ద కుమార్తె పుష్పలత, అదే గ్రామానికి చెందిన మైలపల్లి దానేస్, గన్నెమ్మల కుమారుడు శంకర్‌ ప్రేమించకున్నారు. వరుసకు మేనత్త కుమారుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు కాదనలేక 2014 మార్చిలో వీరిద్దరికీ వివాహం చేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లో శంకర్‌ వలస కూలీగా పని చేసేవాడు. నాలుగేళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా కుమారుడు ప్రణయ్‌(3), కుమార్తె వర్షిణి(2) పుట్టారు. ఈ నేపథ్యంలో పుష్పలత రెండోసారి గర్భం దాల్చగానే రెండేళ్ల కిందట భర్త వదిలేశాడు. కన్నవారి ఇంటికి చేరుకున్న ఈమెకు కుమార్తె వర్షిణి పుట్టాక తనను తీసుకెళ్లాలంటూ నిత్యం కోరేది. అయితే తనంటే ఇష్టం లేదని, వదిలేస్తానని నిత్యం వేధిస్తూ.. మరో అమ్మాయి ఫొటోనే భార్యకు వాట్సాప్‌లో పంపేవాడు. మనో వేదనకు గురైన పుష్పలత బావా తనకు అన్యాయం చేయొద్దని వేడుకునేది. 

పరీక్ష పాసైతే నీతోనే..
అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధించడంతోపాటు తన కుమార్తె కాపురాన్ని చక్కదిద్దాలని రెండు నెలలు కిందట తల్లి రాజులమ్మ గ్రామ పెద్దలను కోరింది. అయితే బావ మారాడని కుమార్తె చెప్పడంతో తల్లి మెత్తబడింది. నెల రోజుల కిందట అల్లుడి ఇంటికి పుష్పలతను తీసుకెళ్లగా గమనించిన అతడు ఇంటి నుంచి పారిపోయాడు. అప్పట్నుంచీ భార్యను ఇంటి నుంచి పంపితేనే వస్తానని, లేకుంటే చనిపోతాని బెదిరించడంతో ఈమె ఇటీవల కన్నవారి ఇంటికి చేరుకుంది. ఈలోగా భార్య అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం పన్నాడు  తన చిన్నాన్న కుమారుడైన వెంకటరమణతో భార్యకు నిత్యం సమాచారం పంపేవాడు. తాను పెట్టిన పరీక్షలో నెగ్గితేనే తీసుకెళ్తానని నమ్మించాడు. ‘నీతో మాట్లాడుతున్నట్లు గ్రామంలోను, మీ ఇంటిలో మీ అమ్మనాన్నలకు, పెద్దలకు తెలియకూడదు. ఇదీ నీకు చివరి పరీక్ష ఇందులో నీవు పాస్‌ అవ్వాలి’ అన్నాడు. ఈలోగా భర్త మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడటంతో భార్య మనసు కరిగిపోయింది. ‘రాత్రికి మీ ఇంటికి వస్తాను.. మీ ఇంటిలో మీ అమ్మను మీ తాతా వాళ్ల ఇంటికి పంపించు’ అని చెప్పడంతో భర్త మాయమాటలు నమ్మి ఆ విధంగా చేసింది. అదే రోజు అర్ధరాత్రి అక్కడకు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

సూసైడ్‌గా మార్చే ప్రయత్నం
భర్త భార్యను హతమార్చి మృతదేహాన్ని తాడుకు కట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించబోయాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు హతాశులయ్యా రు. బోరున విలపిస్తూ మృతదేహాన్ని కిందకు దించారు. అయితే మెడపైన గోళ్లతో రక్కిన ఆనవాళ్లు, తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి నిందితుడు శంకర్‌ను తమదైన శైలిలో విచారించడంతో తానే చంపినట్లు అంగీకరించాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు తహసీల్దారు జీ కల్పవల్లి ఆధ్వర్యంలో శవపంచనామా చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top