విశాఖ ‘సిట్‌’ గడువు పెంపు

Tenure of SIT Probing Visakhapatnam Land Scam Extended - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, పరిసర మండలాల్లో జరిగిన భూకుంభకోణంపై సమగ్ర విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూకుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాలను నిగ్గు తేల్చడం కోసం నూతన ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ గత ఏడాది అక్టోబర్‌ 17న జీవో జారీ చేసింది. విశాఖపట్నం, పరిసర మండలాల్లో విలువైన భూములను కొట్టేయడమే లక్ష్యంగా భూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, ప్రైవేట్‌ భూములకు చెందిన రికార్డులను కూడా తారుమారు చేశారని వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

సిట్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లో సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంది. లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇటీవలే సీఎంను కలిసి మధ్యంతర నివేదిక సమర్పించింది. దర్యాప్తు పరిధి ఎక్కువగా ఉండటం, ఇంకా కొన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నందున తుది నివేదిక సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం మరో మూడు నెలలు సిట్‌ను పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top