పది మంది పట్టణ బహిష్కరణ

Ten Members Urban Expulsion - Sakshi

కందికుంట ప్రసాద్‌కు షాక్‌

అనుచరుడు శ్రీరాములుకు కదిరిలో నో ఎంట్రీ 

సంచలన నిర్ణయం తీసుకున్న పోలీసులు

సాక్షి, కదిరి : తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌కు పోలీసులు ఊహించని విధంగా షాక్‌ ఇచ్చారు. టీడీపీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్‌ సాలమ్మ భర్త, కందికుంట అనుచరుడు అయిన చెట్ల శ్రీరాములు సహా పదిమందిని పట్టణం నుంచి బహిష్కరించారు. వీరంతా ఇటీవల జరిగిన మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన నారాయణస్వామి హత్య కేసులో నిందితులు. ఈ హత్య అనంతరం కూడా వీరు పలు హత్యాయత్నం కేసుల్లో ఉన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్యత్‌లో నేరాలు పెరిగే అవకాశం ఉందని భావించి కొన్నాళ్ల పాటు వీరిని కదిరి నుంచి బహిష్కరిస్తున్నట్లు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్‌ ప్రకటించారు. మంగళవారం వారందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, లగేజ్‌తో సహా వెంట తీసుకుని రమ్మని అక్కడి నుంచి పట్టణానికి దూరంగా వెళ్లి ఎక్కడికైనా వెళ్లి జీవితం గడపాలని ఆదేశించారు. అక్కడ కూడా నేరాలకు పాల్పడితే మరింత కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు వాయిదాలకు హాజరు కావాలన్నా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే పట్టణంలోకి ప్రవేశించాలని సీఐ ఆదేశించారు. 

బహిష్కరణ వేటుకు గురైంది వీరే.. 
టీడీపీ నాయకుడు చెట్ల శ్రీరాములు, మహేష్, జగదీష్, వీర మహేష్‌ అలియాస్‌ వీర, తేజ్‌దీప్‌ అలియాస్‌ తేజ, అంపావతిని సురేష్‌ అలియాస్‌ శరత్, జయ, చంద్రశేఖర్, సుదర్శన్, నందకుమార్‌ అలియాస్‌ నంద బహిష్కరణ వేటుకు గురైన వారిలో ఉన్నారు. వీరంతా కందికుంట అనుచరులేనని పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top