కళాకారుల కళ చెదురుతుంది | Technology Has Profound Impact On Livelihood Of Artisans | Sakshi
Sakshi News home page

కళాకారుల కళ చెదురుతుంది

Jul 10 2019 11:36 AM | Updated on Jul 10 2019 11:36 AM

Technology Has Profound Impact On Livelihood Of Artisans - Sakshi

సాక్షి, పిడుగురాళ్ల : ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం చేతివృత్తి కళాకారుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతోంది. కళాకారులు వేసిన చిత్రాలు ఏళ్ల తరబడి నాణ్యతను సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే డిజిటల్‌ రంగప్రవేశం కళాకారుల బతుకుల్ని చిదిమేసింది. కొద్దిరోజుల్లో చిరిగి, రంగులుపోయే వినైల్, ఫ్లెక్సీ ప్రింటింగ్, స్టిక్కర్‌ కటింగ్‌ మిషన్లు, లైటింగ్‌ బోర్డులపైనే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో కళనే వృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులకు ఉపాధి కరువైంది. చిత్రకళ తప్ప ఇతర పనులుచేయడం చేతగాకపోవడంతో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కళాకారులు ఇక్కట్లు పడుతూ దయనీయ జీవనం గడుపుతున్నారు.

ఉపాధి కోల్పోయిన కళాకారులు...
డిజిటల్‌ ప్రింటింగ్‌తో చిత్రకారులు జీవనోపాధి కోల్పోయారు. నియోజకవర్గంలో సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు దుకాణాల ఎదుట బోర్డులు, బ్యానర్లు రాస్తూ, బొమ్మలు వేస్తూ జీవనం సాగించేవారు. ఎన్నికలు వస్తే ఇక ఆర్టిస్టులు రేయింబవళ్లు పదులసంఖ్యలో పనిచేసేవారు. అయితే ఎన్నికల్లో గోడలపై రాతలు, బ్యానర్లు ఉండరాదన్న ఎన్నికల కమిషన్‌ నియమావళితో 50 శాతం మంది ఆర్టిస్టు ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కాలక్రమంలో డిజిటల్‌ ప్రింటింగ్‌ రంగప్రవేశంతో మిగిలిన 40 శాతం మంది ఆర్టిస్టులకు పనిలేకుండా పోయింది.

కొద్దోగొప్పో ఆర్థికస్తోమత ఉన్నవారు డిజిటల్‌ ప్రింటింగ్‌ మిషన్లు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్లకు రంగులు వేయడానికి వెళుతున్నారు. మరికొందరు కష్టమైనా వేరే వృత్తిని ఎంచుకోలేక పెయింటింగ్‌ వృత్తినే నమ్ముకుని వారానికి ఒకసారో, రెండుసార్లో వచ్చే పనులకు వెళ్లి రంగులువేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అక్కడక్కడ పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలను గీస్తూ జీవనం సాగిస్తున్నారు. తమకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేసి చేయూతనివ్వాలని ఆర్టిస్టులు కోరుతున్నారు. 

90 శాతం పనులు తగ్గాయి
35 ఏళ్లుగా ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కళాకారులకు 90శాతం మేర పనులు తగ్గాయి. డిజిటల్‌ ఫ్లెక్సీలు రావడంతో అందరూ వాటినే ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో మాకు పనులు సన్నగిల్లాయి. ప్రభుత్వం చేతివృత్తి కళాకారులకు రుణాలు మంజూరుచేస్తే ఏదొక వ్యాపారం పెట్టుకుని జీవనం సాగిస్తాం.
– కె.చెన్నకేశవ, ఆర్టిస్టు, పిడుగురాళ్ల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement