
బాబుతో పాటు సీనియర్ల ప్రమాణ స్వీకారం
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఈ నెల ఎనిమిదో తేదీన 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ప్రధాని మోడీ వస్తే మాత్రం చంద్రబాబు ఒక్కరే
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఈ నెల ఎనిమిదో తేదీన 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే చంద్రబాబు ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రధాని రాక అనుమానమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మోడీ రానిపక్షంలో తనతోపాటు ఆరు నుంచి 15 మందికి తగ్గకుండా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గౌతు శ్యామసుందర శివాజీ (శ్రీకాకుళం), పతివాడ నారాయణస్వామి నాయుడు (విజయనగరం), చింతకాయల అయ్యన్నపాత్రుడు (విశాఖపట్నం), యనమల రామకృష్ణుడు (తూర్పు గోదావరి), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), దేవినేని ఉమామహేశ్వరరావు (కృష్ణా), డాక్టర్ కోడెల శివప్రసాదరావు (గుంటూరు), సిద్ధా రాఘవరావు (ప్రకాశం), డాక్టర్. పి. నారాయణ (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు), కేఈ కృష్ణమూర్తి (కర్నూలు)లకు అవకాశం కల్పించనున్నారు.