టీడీపీని చిత్తుగా ఓడించండి | tdp lost the deposits in mlc elections says bhuma nagireddy | Sakshi
Sakshi News home page

టీడీపీని చిత్తుగా ఓడించండి

Jun 17 2015 9:43 AM | Updated on Aug 29 2018 6:26 PM

టీడీపీని చిత్తుగా ఓడించండి - Sakshi

టీడీపీని చిత్తుగా ఓడించండి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు.

జిల్లాలో ఆ పార్టీకి బలం లేదు
చంద్రబాబుది ద్వంద్వ విధానం
ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయారు
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి

 
నంద్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీని చిత్తుగా ఓడించాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో తన నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్సీపీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి విజయానికి కారణమవుతున్నాయన్నారు. దళితులను అవమానిస్తూ ఎస్సీ నియోజకవర్గాల్లో  ఓసీలను ఇన్‌చార్జిలుగా నియమించడం,  సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో టీడీపీలో కలకలం రేగిందన్నారు.

పార్టీని నమ్ముకొని ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం పార్టీని చిత్తచిత్తుగా ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడం బాధాకరమన్నారు. తమ పార్టీలో 11మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పాటు వైఎస్సార్సీపీ తరఫున ఎంపికైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఐక్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రాలో ఒక విధంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు.
 
అవినీతి పార్టీకి ఓటు వేయొద్దు: ఎస్వీ
అవినీతి ఊబిలో కూరుకొని పోయిన టీడీపీకి ఓటు వేసి, దానిని నిరుపయోగం చేసుకోవద్దని టీడీపీకి చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నీతులు మాట్లాడే అర్హత లేదన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 86 ఓట్లు  మైనస్ ఉంటే ఎలా అభ్యర్థిని రంగంలోకి దించుతారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ ప్రభావితం ఏ మాత్రం చేయని తెలంగాణలోనే ఒక ఓటుకు రూ.5కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం ఉన్న చోట ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అర్థమవుతుందని ఆయన అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు. జిల్లాలోని  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సహకారంతో తాను విజయం సాధిస్తానని వెంకటేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement