ఇసుక దందా | TDP leaders Sand danda | Sakshi
Sakshi News home page

ఇసుక దందా

Nov 12 2017 10:43 AM | Updated on Aug 28 2018 8:41 PM

TDP leaders Sand danda  - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నదీగర్భంలో ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాతో అధికార పార్టీ నేతలు కోట్లు గడిస్తున్నారు. ఈ దందాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం తాడిపూడి, వేగేశ్వరపురం, బల్లిపాడు, ఆరికిరేవుల, ర్యాంపులు నడవడం లేదు. ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్, వాడపల్లి ర్యాంపులు నడుస్తున్నాయి. వీటిలో కొవ్వూరు ర్యాంపులో ఇసుక లేని కారణంగా రెండు రోజుల నుంచి అమ్మకాలు కొనసాగడం లేదు. తాడిపూడి ర్యాంపులో టీడీపీ నాయకుల సహకారంతో డ్రెజ్జింగ్‌ యంత్రాలను వినియోగించి రాత్రి పూట ఇసుక తవ్వకాలు కొనసాగేవి. ఇటీవల వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డ్రెడ్జింగ్‌ ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని, ఇసుక అధిక ధరలను నియంత్రించాలని, ర్యాంపుల్లో అక్రమాలను ఆరికట్టాలని కోరుతూ ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు.

 అయినప్పటికీ అంతంత మాత్రంగానే స్పందన రావడంతో నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో గడిచిన ఐదురోజుల నుంచి ఇక్కడ తవ్వకాలు పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ అక్రమ తవ్వకాలు అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గోదావరిలో వరదనీరు ఎక్కువగా ఉండడంతో వేగేశ్వరపురం, బల్లిపాడు ర్యాంపులు తెరుచు కోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆరికిరేవుల ర్యాంపుకి ఇటీవల నూతనంగా అనుమతి ఇచ్చినప్పటికీ ఇక్కడ తవ్వకాలు చేపట్టడానికి ప్రస్తుతానికి అనువుగా లేదు. దీంతో ఈ మూడు ర్యాంపులు ప్రారంభం కాలేదు. తాళ్లపూడి మండలంలో ప్రక్కిలంక, కొవ్వూరు మండలంలో కొవ్వూరు, ఔరంగబాద్, వాడపల్లి ర్యాంపులు మాత్రం నడుస్తున్నాయి. ఈ నాలుగు ర్యాంపుల్లోను పడవల సహకారంతోనే ఇసుక సేకరణ చేస్తున్నారు.

అధికార పార్టీ నేత కనుసైగల్లోనే...
కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులన్నీ అధికార పార్టీ నాయకుల కనుసైగల్లోనే నడుస్తున్నాయి. నాయకుల మాట వినకపోతే ర్యాంపు మూసివేయాల్సిందే. కొవ్వూరు, ప్రక్కిలంక ర్యాంపులో పది పడవలు, ఔరంగబాద్‌లో సుమారు ముప్‌పై పడవలు, వాడపల్లిలో అరవై పడవలు చొప్పున ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్నారు. బొట్స్‌మెన్‌ సొసైటీల ముసుగులో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పడవలు నడుపుతున్నారు. పడవల ద్వారా సేకరించే ఇసుక యూనిట్‌ ధర లోడింగ్‌తో రూ.800గా జిల్లా స్టాండ్‌ మైనింగ్‌ కమిటీ నిర్ధారించింది. వాస్తవంగా ర్యాంపుల్లో ఈ ధర ఎక్కడా అమలు కావడం లేదు. ప్రక్కిలంకలో ఇసుక యూనిట్‌కు రూ.1200 నుంచి 1400 వరకు వసూలు చేస్తున్నారు. వాడపల్లిలో రూ.1,000 నుంచి రూ.1,200 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. నాలుగు ర్యాంపుల నుంచి రోజుకి సరాసరి 1,500 యూనిట్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.

పర్యవేక్షణ నామమాత్రం 
ప్రతి ర్యాంపులోను పోలీసు కానిస్టేబుల్, వీఆర్వోతో పాటు మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లూప్రాంగ్స్‌ అనే సంస్థ ప్రతినిధులు ప్రతి లారీ వివరాలను నమోదు చేస్తున్నారు. వచ్చిన లారీలను సీరియల్‌గా పంపుతున్నారు. వాస్తవంగా యూనిట్‌ రూ.800ల చొప్పున వీరు రశీదులు ఇస్తున్నప్పటికీ ఈ ధర మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. ర్యాంపుల్లో వీరికి రోజువారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో వీరు ధర విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement