మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు మింగేద్దాం

TDP Leaders plane to scam mobilization advances - Sakshi

ఎన్నికల ఇం‘ధనం’ కోసం..

రెండు నెలల్లో రూ.1,700 కోట్లు కొట్టేసేందుకు ప్లాన్‌

రూ.17,367 కోట్లతో కొత్తగా 15 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి

హైడ్రలాజికల్‌ క్లియరెన్స్, డీపీఆర్‌లు లేకుండానే టెండర్లు పిలవాలని ప్రభుత్వ పెద్దల ఒత్తిడి

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం.. అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.1,700 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు  

మొత్తం అడ్వాన్స్‌లను కమీషన్ల కింద కొట్టేసి, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని యోచన

సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 15 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. కనీసం హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) కూడా లేకుండానే.. లైన్‌ ఎస్టిమేట్ల(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగానే రూ.17,367 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని జలవనరుల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ప్రేమతో ఇదంతా చేస్తోందనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, కోటరీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్ల కింద దండుకునేందుకు వ్యూహరచన చేశారు. ఈ సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ, నాగావళి(తోటపల్లి) కాలువల ఆధునికీకరణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే వాటిని కట్టబెట్టాలంటూ కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. జనవరి రెండో వారంలోగా మిగిలిన ప్రాజెక్టుల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. 

ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే..
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం రూ.44,877.24 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిన దాఖలాలు లేవు. కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లందించలేకపోయారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇం‘ధనం’ సమకూర్చుకోవడానికి కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోగా ఆయా ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి.. మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్‌ల రూపంలో నొక్కేయడానికి పక్కాగా స్కెచ్‌ వేశారు. 

లైన్‌ ఎస్టిమేట్లే ఆధారం 
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ వంశధార ట్రిబ్యునల్‌ తీర్పును ఇచ్చింది. కానీ, వంశధార ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వంశధార–బాహుదా నదుల అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన సర్వే ప్రక్రియే పూర్తి కాలేదు. లైన్‌ ఎస్టిమేట్లు ఆధారంగా టెండర్లు పిలవాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌) కుడి కాలువ తవ్వుకోవడానికి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. నాలుగు టీఎంసీల నీటిని కేటాయించింది. గత నాలుగున్నరేళ్లుగా ఆర్డీఎస్‌ కుడి కాలువకు సంబంధించి డీపీఆర్‌ తయారు చేయడంలో సర్కార్‌ విఫలమైంది. ఇప్పుడు లైన్‌ ఎస్టిమేట్ల ఆధారంగా ఆ పనులకు టెండర్లు పిలవాలని అంటున్నారు. కర్నూలు–కడప(కేసీ) కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి గుండ్రేవుల రిజర్వాయర్‌ సర్వే పనులు కూడా పూర్తి చేయలేని సర్కార్‌.. ఆ పనులను చేపడతామని చెబుతుండటంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. 
 
కుప్పంలో 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ.41.70 కోట్లు 
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పరిధిలో పాలార్‌ నదిపై నిర్మించిన 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు, పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.41.70 కోట్లు మంజూరు చేసింది. ఈ చెక్‌డ్యామ్‌ల కింద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా లేదు. కానీ, వాటి మరమ్మతు, పునరుద్ధరణ వల్ల 5,527 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని పేర్కొంటూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చెక్‌డ్యామ్‌ల మరమ్మతు, పునరుద్ధరణ పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లు కొల్లగొట్టడానికి ఉన్నతస్థాయిలో ప్రణాళిక రచించినట్లు సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top