మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లో టీడీపీ నేతలు

TDP Leaders Lives In Hospital Employees Quarters In Ananthapuram - Sakshi

ఇది మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లోని బ్లాక్‌–1. మొదటి ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో భీమేశ్వర నాయుడు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. టీడీపీకి చెందిన ఇతను సర్వజనాస్పత్రి ఉద్యోగి కాదు. గతంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసి మానేశాడు. అయినా ఆస్పత్రి అధికారులు ఆయనకు వసతి    కొనసాగిస్తున్నారు. దీంతో అతను రూ.1,400 అద్దె చెల్లిస్తూ రెండు పడకల గదులున్న ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఆస్పత్రి సిబ్బందికి దక్కని వసతి భీమేశ్వరనాయుడికు ఎలా దక్కిందో అధికారులకే తెలియాలి.  

సాక్షి, అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రి ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో అనర్హులు పాగా వేశారు. ఉద్యోగులకు వసతి కల్పించాల్సిన ఉన్నతాధికారి.. పచ్చనోటుకు, పచ్చ కండువాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అనుచరులు తిష్టవేశారు. రూ.1,400 అద్దె చెల్లిస్తూ నగరం నడిబొడ్డున వసతి పొందుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సబ్‌ లీజు కింద శానిటేషన్‌ నిర్వహణను పరిశీలించే భీమేశ్వర్‌ నాయుడు అనే వ్యక్తి ఏళ్ల తరబడి మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లో తిష్ట వేశాడు. ఇతను గతంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలో ల్యాబ్‌ అటెండెంట్‌గా పని చేశాడు. శానిటేషన్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆయన.. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తప్పుకున్నారు.

అయినప్పటికీ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నారు. గతంలో ఆస్పత్రిలోని కొందరు అధికారులు దీనిపై అభ్యంతరం తెలిపినా.. అప్పుడున్న సూపరింటెండెంట్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి దాస్‌ పేరున తీసుకున్న క్వార్టర్స్‌లో ఉరవకొండకు చెందిన టీడీపీ కార్యకర్త ఉంటున్నాడు. వీరితో పాటు ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ పేరు మీద క్వార్టర్స్‌ తీసుకుని వారి బంధువులకు అప్పగించారు. మెడికల్‌ క్వార్టర్స్‌లోని నాన్‌ టీచింగ్‌ బ్లాక్‌లో 48 క్వార్టర్స్‌ ఉండగా.. దాదాపు 10 మంది ఇతరులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అందులో రెండు క్వార్టర్స్‌ మాత్రమే ఖాళీగా ఉన్నాయి.  

రూ.20 వేలు ఇస్తే వసతి 
రూ.20 వేలు ముట్టజెబితే చాలు మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లో వసతి దొరుకుతుందని ఇక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. క్వార్టర్స్‌ కేటాయించే ఉన్నతాధికారి చేయితడపందే వసతి దొరకదని వాపోతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగినికి క్వార్టర్స్‌ కేటాయించేందుకు అప్పుడు క్వార్టర్స్‌ కేటాయింపు బాధ్యతలు చూస్తున్న అధికారి రూ.20 వేలు తీసుకున్నట్లు సర్వజనాస్పత్రి ఉద్యోగులే చెబుతున్నారు. ఆమె వద్ద డబ్బు తీసుకున్న సదరు అధికారి సంవత్సరానికి క్వార్టర్స్‌ కేటాయించడం గమనార్హం.
 
పర్యవేక్షణ కరువు 
వాస్తవానికి ఆస్పత్రి ఉన్నతాధికారులు మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌ను తరచూ సందర్శించాలి. ఉద్యోగులే నివాసం ఉంటున్నారా..? ఇతరులెవరైనా ఉంటున్నారా? అన్నది తెలుసుకోవాలి. ఇతరులు ఎవరైనా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తిస్తే వెంటనే ఖాళీ చేయించాలి. అయితే సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఇప్పటికైనా సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు మెడికల్‌ క్వార్టర్స్‌లో ఎవరెవరు ఉంటున్నారో పరిశీలించాలని, అనర్హులను ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలని సర్వజనాస్పత్రి ఉద్యోగులు కోరుతున్నారు. 

భారీగా అద్దె బకాయిలు 
మెడికల్‌ క్వార్టర్స్‌లోని నాన్‌టీచింగ్‌ బ్లాక్‌లోని ఒక్కో క్వార్టర్‌కు రూ.1,400గా అద్దె నిర్ణయించారు. నగరం నడిబొడ్డున అన్ని సౌకర్యాలన్న ఇల్లు కావాలంటే బయట కనీసంగా రూ.7 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత తక్కువకు క్వార్టర్స్‌ ఇచ్చినా అందులో ఉంటున్న వారిలో చాలా మంది సుమారుగా 30 నెలల అద్దె బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. 

బయటి వ్యక్తి ఒక్కరే..  
మెడికల్‌ క్వార్టర్స్‌లో బయటి వ్యక్తులు ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లంతా ఉద్యోగులే. ప్రస్తుతం ఉన్న వాళ్లలో చాలా మంది బాడుగ కట్టడం లేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. బయటి వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటాం. 
– డాక్టర్‌ లలిత, ఆర్‌ఎంఓ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top