సత్యప్రమాణంగా దోపిడీ | Sakshi
Sakshi News home page

సత్యప్రమాణంగా దోపిడీ

Published Wed, Mar 13 2019 5:41 PM

TDP Leaders Corruption In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : సత్యప్రమాణాల దేవుడిగా పేరున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి సాక్షిగా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూతలపట్టు నియోజకవర్గంలో అవినీతికి హద్దే లేకుండాపోయింది. అధికారం తమదే..అడిగేవారే లేరని ‘తమ్ముళ్లు’ బరితెగించారు. ఏకంగా చెరువులనే మింగేశారు. ఇసుకను కొల్లగొట్టి రూ.కోట్లు లూటీ చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ తమ్ముళ్లకు ఫలహారంగా మారాయి. రైతు రథాలకు అర్హులైన రైతులకు కాకుండా టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పింఛన్లు, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు, సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారుల నుంచి టీడీపీ నేతలు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ లలిత కుమారి నుంచి  ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు నిలువునా డబ్బులు దోచుకున్నారు. అధికారులు సైతం వత్తాసు పలకడంతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు.

నీరు–చెట్టు నిధులు ఫట్‌

తవణంపల్లె మండలంలో నీరు– చెట్టు కింద 2017–18లో 64 పనులకు రూ.5 కోట్ల నిధులు వ్యయం చేశారు. ఈ పనులన్నీ టీడీపీ నాయకులే చేపట్టారు.  2108–19 సంవత్సరంలో రూ.25 లక్షలతో ఐదు పనులు చేపట్టారు. ఉత్తరబ్రాహ్మణపల్లె చెరువు పనులను రూ.6.50 లక్షలతో కట్టను బలపర్చడం, ముళ్ల చెట్ల తొలగింపు పనులను టీడీపీ నాయకుడు దిలీప్‌ చేశాడు. ఏడాది కూడా కాకముందే చెరువు కట్ట మధ్యలో బీటలు వారాయి. భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగుతుందేమోనని స్థానికులు భయపడతున్నారు. అదేవిధంగా చెరువుల్లో ముళ్లచెట్లను తూతూమంత్రంగా తొలగించి టీడీపీ నాయకులు లక్షల రూపాయిలు ఆర్జించారు. జెడ్పీటీసీ వెంకటేశ్వరచౌదరికి బినామీగా కుక్కలమిట్టకు చెందిన దిలీప్‌కుమార్‌ తవణంపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె చెరువుల్లో ముళ్ల చెట్లు తొలగించే పనులు చేశాడు. 

బాహుదాను తోడేశారు..

ఇసుకు మాఫియాకు కక్కలమిట్ట కేరాఫ్‌గా మారింది. ఇక్కడ టీడీపీ నాయకులు బాహుదానదిలో ఇసుకను తోడేస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వి రోజుకు 100 లోడ్ల ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్‌ చేసి బయట ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కక్కలమిట్ట, ఎగువ తవణంపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, మైనగుండ్లపల్లె, నర్తపుచేను, దిగువ తడకర, ఎగువ తడకర, దిగువమాఘం, కట్టకిందపల్లె గ్రామాల వద్ద ప్రభుత్వ పనుల పేరిట  అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తవణంపల్లె, బంగారుపాళ్యం, ఐరాల, చిత్తూరు, యాదమరి మండలాల నుంచి ఇసుక అక్రమ రవాణాకు  తవణంపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు రింగ్‌లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. కక్కలమిట్ట సమీపంలో  బాహుదానదిలో నుంచి జెడ్పీటీసీ అనుచరుడు దిలీప్, నర్తపుచేను వద్ద నుంచి గోపీయాదవ్, ఎగువ తడకర వద్ద నుంచి మణినాయుడు, మరికొందరు  నిత్యం ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు కొల్ల గొడుతున్నారు.

చెరువుల్నే మింగిన నేతలు

పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికారపార్టీ నేతల అవినీతి తారస్థాయికి చేరింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, తవణంపల్లె, బంగారుపాళెం, ఐరాల మండలాల్లో అన్నింటా తెలుగుతమ్ముళ్లదే పెత్తనం. యాదమరి మండలంలో చెరువులను ఆక్రమించి టీడీపీ తమ్ముళ్లు ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. యాదమరి మండలంలోని గూటల వంక చెరువు, నుంజర్ల ప్రాజెక్టు చెరువులో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ చెరువులపై టీడీపీ నాయకుల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా చెరువు భూములను ఆక్రమించి ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. ధర్మయ్య  చెరువులో సర్వే నెం. 281లో  నాలుగు ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. ఆయకట్టు రైతులు అ«ధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. ఇదే మండలంలో తమిళనాడు సరిహద్దులోని కనికాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులో అధికారపార్టీ నేతల అండదండలతో పలువురు పంటలు సాగు చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

బంగారుపాళ్యం మండలంలో...

బంగారుపాళెం మండలంలో రైతు రథం పథకం కింద పది యూనిట్లు మంజూరు కాగా  అందులో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సిఫార్సు చేసిన వారికి మాత్రమే అందాయి.

మండలంలోని కీరమంద పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో మంజూరు అయిన బృందావనం పనులు, వర్మీకంపోస్టు తొట్టెల నిర్మాణాలు, నీరు– చెట్టు కింద చేపట్టి చెక్‌డ్యామ్‌ నిర్మాణపనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా  స్థానిక ఎంపీటీసీ శీనప్ప నిధులు స్వాహా చేశాడు.

♦ బంగారుపాళెం మండలం తగ్గువారిపల్లె పంచాయతీ పరిధిలో ఇటీవల  రూ.కోటితో  సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. మాజీ ఉపసర్పంచ్‌ లోకనాథనాయుడు పనులన్నీ నాసిరకంగా చేసి నిధులు కాజేశారు.

♦ బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లెలో  టీడీపీ నాయకుడు రవీంద్ర గత ఏడాది రూ.10 లక్షలతో చెక్‌డ్యాంను నాసిరకంగా నిర్మించి నిధులు మింగేశాడు.

♦ బంగారుపాళెం మండలంలోని కాటప్పగారిపల్లె రోడ్డుపనులు, క్రీడాకోర్టుల నిర్మాణంలో టీడీపీ నాయకుడు చేతివాటం చూపించాడు.

♦ మండల కేంద్రం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల  క్రీడామైదానం ఆవరణలో గత ఏడాది ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రీడాకోర్టులను మంజూరు చేసింది. వాలీబాల్, రన్నింగ్‌ ట్రాక్, ఖోఖో కోర్టుల నిర్మాణానికి రూ 2.63 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది. పట్టణ టీడీపీ నాయకుడు చరణ్‌చౌదరి క్రీడా కోర్టు నిర్మాణ పనులను చేపట్టాడు. ఏడాది అవుతున్నా వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, రన్నింగ్‌ ట్రాక్‌ పనులు పూర్తిస్ధాయిలో చేపట్టలేదు. అరకొర పనులు చేసి రూ.1.43 లక్షల బిల్లులు చేసుకున్నాడు.

♦ టేకుమంద పంచాయతీలో 12 మందికి ఎన్‌టీఆర్‌ గృహాలు మంజూరు అయ్యాయి. టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు భాస్కరయ్య కమీషన్లు తీసుకుని తమకు అనుకూలమైన వారికి ఇప్పించాడు.

♦ మండలంలోని కొదలమడుగు పంచాయతీలో పంట సంజీవని కింద 20 పనులు మంజూరు అయ్యాయి. టీడీపీ నాయకుడు అనూప్‌ పంచాయతీ పరిధిలోని 10 పంట సంజీవని కుంటలను రైతులకు ఉపయోగపడని కొండప్రాంతాల్లో తవ్వి నిధులు కాజేశారు.

రైతు రథాలన్నీ వారికే..

తవణంపల్లె మండలంలో రైతు రథం పథకం కింద 2017–18లో 10 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అదేవిధంగా 2018–19లో11 రైతురథం ట్రాక్టర్లు మంజూరు కాగా అన్ని టీడీపీ కార్యకర్తలకు మంజూరు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి లలితకుమారి, జెడ్పీటీసీ చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీని టీడీపీ నాయకులే ఆర్జించారు.

పథకాల మంజూరులో పైసా వసూల్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 2017–2019లో సబ్సిడీ రుణాలు 210 మంజూరు కాగా, నిజమైన లబ్ధిదారులకు కాకుండా అ«ధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇచ్చారు. నాయకులు చెప్పనవారికే బ్యాంకర్లు ఓకే అనడం గమనార్హం. రూ.లక్ష రుణానికి, రూ.10వేలు, రూ.50వేలు రుణాలకు  రూ.5 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై చాలామంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పింఛన్లు 210, ఎన్టీఆర్‌ ఇళ్లు 121 మంజూరు కాగా, వాటిని జన్మభూమి కమిటీల అండతో తమకు అనుకూలంగా ఉన్న వారికి మంజూరు చేయించారు. దీంతో నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదు.

అధికార పార్టీ నాయకులంటే అధికారులకు ఎందుకు భయం

అధికార పార్టీ నాయకులంటే అధికారులకు ఎందుకు భయం తెలియలేదు. వారు కూడా మనుషులే. చెరువు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు నిజాలను గుర్తించి  అక్రమాలు తొలగించాలి, అంతేగానీ నాన్చుకుంటూ ఉండడం ఎందుకో. అ«ధికారులు భయ పడకుండా పనులు చేయాలి.
–వేణు. ఆయకట్టు రైతు

అక్రమంగా పంటలు పండిస్తున్నారు

చాలామంది రైతులు అక్రమంగా  పంటలు పండిస్తున్నారు. పండిస్తే పర్వాలేదు. మళ్లీ ఆ భూమి మాదే అనే పరిస్థితికి వస్తున్నారు. ఎవరూ కూడా చెరువుల భూముల్లో పంటలు పండించకుండా అధికారులు చూడాలి.
–సుందరమూర్తి, చెరువు ఆయకట్టు దారు

అన్ని అర్హతలు ఉన్నా మంజూరు కాలేదు

సబ్సిడీ రుణాలకు అప్లికేషన్‌ వేశాను. ఇంటర్య్వూలకు వెళ్లాను. అన్ని అర్హతులు ఉన్న నాకు సబ్సిడీ రుణం  మంజూరు కాలేదు. అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అని చెప్పారు. చివరకు కలక్టర్‌కు ఫిర్యాదు చేశాను. కానీ నాకు రుణం మంజూరు కాలేదు.
–అన్న, యాదమరి మండలం

Advertisement
Advertisement