
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఈ ఏడాది ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పుతో చావు దెబ్బతిన్న జిల్లా టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఎన్నికలనంతరం కూడా అంతర్గత విభేదాలతో పార్టీ మరింత పతనావస్థకు చేరింది. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కూడా కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది. తాజాగా ఏకంగా అధినేత సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది.
కడప పర్యటనలో రెండవరోజు మంగళవారం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జిరిగిన కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో 15వ డివిజన్ ఇన్‌చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో గొడవ మొదలైంది. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. చంద్రబాబు సమక్షంలోనే సుబ్బయ్యపై శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఇంత జరుగుతున్నా చంద్రబాబు సరైన విధంగా స్పందించక పోవడం గమనార్హం. ఈ సంఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, 8 మంది అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.