ఇసుక తోడేళ్లండీ... ఓటేద్దామా చెప్పండీ..!

TDP Leaders Are Looting Crores of Rupees Sand - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక ఉచితం అనగానే చాలా బాగుందని అనుకున్నారంతా... కానీ ఆ ‘ఉచితం’ టీడీపీ నేతలకనే విషయం అర్థమైన జనం నివ్వెరపోయారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధుల ‘నిధులు’ సంపాదనకు పెద్దపీట వేయడమే కాకుండా తమ అనుచరులకూ చోటు కల్పించడంతో విలువైన సంపదంతా దోపిడీకి గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన ఇసుకను వందలాది ట్రాక్టర్లతో తోడేస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

తుని: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన అమాత్యులు సహజ సంపదను అనుచరులు కొల్లగొడుతున్నా అడ్డుకట్ట వేయకపోగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తాండవ నదిలో టన్నుల కొద్దీ ఇసుకను అడ్డదారుల్లో విక్రయించేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడి ఇలాకాలో సోదరుడు యనమల కృష్ణుడు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ నదీమతల్లిని నిలువెల్లా చెరిచేస్తున్నారు.

 2014లో అధికారంలోకి వచ్చాక తాండవనదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి సుమారు రూ.200 కోట్లు అక్రమార్జన చేశారు. ఇప్పుడు అదే నాయకుడు తుని నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్న అండదండలతో ఇసుక మాఫియాను నడపించిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటే ప్రజలకు భరోసా ఎక్కడ ఉంటుందని రాజకీయ విశ్లేషుకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు.

ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘నేను మరాను, మీకు అండగా’ ఉంటానని చెబుతున్నారు. ఐదేళ్లగాలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వని నాయకులు మేలు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే జనం నివ్వెరబోతున్నారు.

వందల కోట్లు ఆర్జన...
విశాఖ జిల్లా నాతవరం మండలంలో తాండవ ప్రాజెక్టు ఉంది. తూర్పు, విశాఖ జిల్లాలో పరిధిలో సుమారు 55 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నాతవరం నుంచి పెంటకోట వరకు సుమారు 45 కిలోమీటర్లు మేర తాండవ నరదీ పరీవాహక ప్రాంతం ఉంది. ప్రాజెక్టు నుంచి అదనపు జలాలు సముద్రంలోకి నది ద్వారా వెళతాయి. వరద నీటికి నదిలో వేల క్యూబిక్‌ మీటర్లు ఇసుక నిల్వలు చేరతాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు తాండవ ఇసుకపై కన్ను వేశారు.

చేతిలో అధికార మంత్రదండం ఉండడంతో కోటనందూరు నుంచి తుని వరకు అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపారు. రోజుకు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేశారు. ఐదేళ్ల వ్యవధిలో వేలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను రూపాయి పెట్టుబడి లేకుండా అమ్ముకున్నారు. సగటున రోజుకు 100 లారీలు, 200 ట్రాక్టర్లు ఇసుకను తరలించారు. లారీకు రూ.5వేలు, ట్రాక్టర్‌కు రూ.1000లు చొప్పున వసూలు చేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా సొమ్ములు వసూలు చేయించారు. ఎక్కడా అధికార పార్టీ కీలకనేత పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

నదిలో కలిసి పోయిన రైతుల భూములు...
నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వకాలు జరపడంతో నదీ గమనం మారిపోయింది. నదికి ఇరు వైపులా పంట భూములు నదిలో కలిసి పోయాయి. కోటనందూరు నుంచి తుని వరకు వందల ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి ఉంది. వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు. ఇరిగేషన్‌ అధికారులు నది విస్తీర్ణం (వెడల్పు) ఎంతో ఇప్పటికీ తేల్చలేదు. నదిలో ఉన్న ఇసుక అయిపోవడంతో సమీపంలో ఉన్న పంట భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు.

ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇసుక మాఫియా ధాటికి వ్యవసాయ బోర్లు కూడా నిరుపయోగమయ్యాయి. స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. సార్వత్రిక ఎన్నికల బరిలో అధికార పార్టీ తరఫున యనమల కృష్ణుడు పోటీలో నిలవడంతో ఇసుక మాఫియా ప్రభావం ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

రైతుల పక్షాన ఎమ్మెల్యే రాజా పోరాటం...
ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక సంబంధిత రైతులు, బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజాను ఆశ్రయించారు. రైతుల భూముల్లో తవ్వకాలు చేయడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజాపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టారు. 2015లో తుని మండలం డి.పోలవరంలో ఏకంగా ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు బనాయించారు. ఇదే రీతిలో ఇసుక తవ్వకాలపై పోరాటం చేసినా పలువురు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టారు.

పంట భూమి నదిలో కలసిపోయింది
నాకు కోటనందూరులో తాండవ నదిని ఆనుకొని రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇసుక తవ్వకాలతో తాండవ నది గట్టుతోపాటు నా పొలం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. ఇసుకను తవ్వవద్దని చెప్పినా పట్టించుకోవడం లేదు.  అధికారుల దృష్టికి తీసుకెళ్తే రెండు, మూడు రోజులు ఆపి మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా సాగుతోంది. పెద్ద వర్షాలు వస్తే నా పొలం చాలా వరకూ నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
 – అల్లూరి రాజు, రైతు, కాకరాపల్లి

ఇసుక మాఫియా జులుం
తాండవ నదిలో ఇసుక తోలకాలతో గట్టు కోతకు గురై పొలాలు ఏటిలో కలసిపోతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా అవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నదిలో ఎక్కడికక్కడ పెద్దపెద్ద గోతులు పెట్టేశారు. భవిష్యత్తులో ఏరు భారీగా వస్తే వ్యవసాయ మకాంలకు వెళ్లేందుకు ఏరు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంతటి దారుణాన్ని మునుపెన్నడూ చూడలేదు.
– ఆళ్ల అప్పారావు, రైతు,  బొద్దవరం 

శ్మశానాలనూ వదలలేదు
ఇసుక అక్రమార్కులు తాండవ నది ఒడ్డులు, నీటి అడుగు భాగం, చివరకు శ్మశానాలను సైతం వదలలేదు. వేల లారీల ఇసుకను దూర ప్రాంతాలకు తరలించేశారు. ఇంతటి అక్రమాలు జరుగుతున్నా స్థానికులకు మాత్రం ఇసుక కొరత ఉంది. ఇసుక అక్రమాలను ఎవరూ అడ్డుకోలేకపోయారు. అధికారులు, పాలకులే ఇసుక అక్రమాలను ప్రోత్సహించారు. 
–చింతకాయల సన్యాసిపాత్రుడు, రైతు, అల్లిపూడి

కోతకు గురవుతున్న భూములు...
విచ్చల విడిగా ఇసుక తవ్వకాలతో విలువైన పంట భూములు తాండవ నదిలో కలసిపోతున్నాయి. నది లోతు పెరిగిపోయింది. భూగర్భ జలాలు క్షీణించి బోరుబావులు పని చేయడంలేదు. 200 అడుగుల వరకూ కొత్త బోరులను తవ్వించాల్సి వస్తుంది.
– చిటెకల వరహాలబాబు, రైతు, డి.పోలవరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top