తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు, ఏఎస్‌ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్‌లో తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు, ఏఎస్‌ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్‌లో తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. దీంతో తెనాలి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. యువకుడు, ఉత్సాహవంతుడైన శివకుమార్ చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
శివకుమార్ ఏఎస్‌ఎన్ పేరిట డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారు. తండ్రి సత్యనారాయణ తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా, తెనాలి శాసనసభ్యునిగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం టీడీపీ నాయకుడిగా వున్న శివకుమార్ 2009 వరకు నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితులై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తండ్రి మరణానంతరం డిగ్రీ కళాశాల నిర్వహణ బాధ్యతను స్వీకరించి, దానిని పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలుగా విస్తరించారు.
శివకుమార్‌తో పాటు పట్టణానికి చెందిన సాయి విద్యాసంస్థల కరస్పాండెంట్ కుదరవల్లి రామ్మోహనరావు, చెన్నుపాటి వెంకటేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ ప్రధాన అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల నుంచి శివకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆయన నియోజకవర్గంలోని తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మంతనాలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరిక టీడీపీకి భారీగా లోటుగా పరిశీలకులు భావిస్తున్నారు.