‘పచ్చ’ పాలనలో.. రెచ్చిన మృగాళ్లు

Tdp Government Neglects Women - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా: మహిళా సాధికారత గురించి నిత్యం నీతులు వల్లె వేసే చంద్రబాబు పాలనలో.. మునుపెన్నడూ లేని రీతిలో అతివలపై అకృత్యాలు పెరిగిపోయాయి. రౌడీయిజం చేస్తూ.. తరచూ వార్తల్లోకి ఎక్కే టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారన్న అక్కసుతో.. అధికార దురహంకారంతో.. మహిళా తహసీల్దార్‌ వనజాక్షి జుట్టు పట్టి ఈడ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా తప్పంతా అధికారిదేనన్నట్టుగా మాట్లాడారు. విశాఖ జిల్లాలో ఓ స్థల వివాదానికి సంబంధించి దళిత మహిళపై టీడీపీ నేతలు పరమ నీచంగా దాడికి దిగినా ముఖ్యమంత్రి కనీసంగా కూడా స్పందించలేదు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. ఇదే అదునుగా ఐదేళ్ల టీడీపీ పాలనలో కామాంధులు కూడా అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు.

కామాంధులకు ప్రభుత్వ పెద్దలు అండగా నిలవడంతో.. ఈ ఐదేళ్లలో మహిళలపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిర్భయ తదితర కఠిన చట్టాలున్నా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లైంగిక దాడులకు తెగబడ్డారు. దివ్యాంగులు, చిన్నారులు, వృద్ధులన్న కనికరం కూడా లేకుండా పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఫలితంగా అమాయక ఆడబిడ్డలు అన్యాయంగా బలైపోతున్నారు. రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులను, దారుణాలను కాగ్‌ నివేదిక స్పష్టంగా పేర్కొంది. భయాందోళన వ్యక్తం చేసింది. దీనికంతటికీ ప్రభుత్వ నిర్లిప్తత, వారి అవకాశవాద రాజకీయమే కారణమన్నది సుస్పష్టం. ఈ పరిస్థితుల్లో టీడీపీ హయాంలో తమకు రక్షణ ఉందా? బయటకెళ్లిన ఆడపిల్ల క్షేమంగా వస్తుందనే భరోసా ఉందా? రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తే అతివలకు భద్రత ఉన్నట్టా? మానప్రాణాలను హరిస్తున్న ఈ పాలకులకా మనం పట్టం కట్టాం? అని మహిళలు భావిస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి టీడీపీ నైజమని మండిపడుతున్నారు.

జిల్లాలో మహిళలపై దాడుల కేసులు
2015 :    1,032
2016 :     994
2017 :     1,332
2018 :     1,090
2019 : సుమారు 500

జిల్లాలో దాడులు జరిగాయిలా..

  • టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో మహిళలపై దాడులు ఎక్కువైపోయాయి. పలుచోట్ల లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. కొన్నింటిలో టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగు చూసింది. మహిళా అధికారుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే వారిని సరెండర్‌ చేయడం, బదిలీ చేయడం చేస్తున్నారు. కొందరైతే మహిళా అధికారులని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
  • ఆమధ్య కత్తిపూడికి చెందిన టీడీపీ నేత, ఎంపీటీసీ సభ్యురాలి భర్త శ్రీనివాస్, మరో ముగ్గురు వ్యక్తులు తొండంగి మండలం తమ్మయ్యపేట వద్ద జాతీయ రహదారిపై ఒక అద్దె ఇంట్లో టీ దుకాణం నడుపుతున్న మహిళపై లైంగికదాడికి యత్నించారు. అడ్డు వచ్చిన ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. గ్రామస్తులు గుమిగూడటంతో అక్కడి నుంచి వుడాయించారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
  • కొన్ని నెలల క్రితం గొల్లప్రోలు నగర పంచాయతీలో పని చేసిన మహిళా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బి.శివలక్ష్మితో.. మురికి కాలువల్లో చెత్త చెదారాన్ని చేతితో ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఆమెను తీవ్రంగా వేధించారు. అంతటితో ఆగలేదు. ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.
  • సామర్లకోట వైఆర్‌ఎల్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినిని రోజూ చాటింగ్‌ చేయాలని, కోర్కెలు తీర్చాలని, లేకుంటే పరీక్షలో మార్కులు వేయనని అదే కళాశాల అధ్యాపకుడు పితాని నూకరాజు బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
  • 2016లో పిఠాపురం మండలం నరసింగపురంలో మానసిక వికలాంగురాలైన 19 సంవత్సరాల యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు.
  • 2016 ఆగస్టు 19న కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన వృద్ధుడు మూడేళ్ల బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు.
  • 2017 జూన్‌ 23న కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన 14 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
  • 2017 డిసెంబర్‌ 6న చింతూరు మండలం విద్యానగరం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ లక్ష్మయ్య అదే పాఠశాలలో ఎనిమిదో  తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
  • రాజమహేంద్రవరంలో నలుగురు యువకులు ఓ బాలికను ఆటోలో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి, ఓ ఇంటిలో నిర్బంధించి లైంగికదాడికి ఒడిగట్టారు.
  • పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగినిని పరిచయం చేసుకున్న రాజమహేంద్రవరం యువకుడు నమ్మించి, మోసగించి బొమ్మూరు తీసుకువెళ్లి.. స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు.
  • సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారం చేశారు. బాధితులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.

ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్లలో అనేకమందిపై లైంగిక వేధింపులు, దాడులు జరిగాయి. జిల్లావ్యాప్తంగా గత ఐదేళ్లలో 7 వేలకు పైగా దాడుల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక్క గ్రామీణ జిల్లాలోనే 5 వేల వరకూ కేసులు నమోదయ్యాయి. వీటిలో 500 వరకూ లైంగికదాడులు ఉన్నాయి. ఆధారాలు లేక నిరూపితం కాని కేసులు వేలల్లో ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top